
- అధిక వడ్డీకి ఆశపడితే అసలుకే ఎసరు వచ్చిందని బాధితుల ఆవేదన
- జూబ్లీహిల్స్‌లోని ఆఫీస్ క్లోజ్.. ఇల్లు ఖాళీ చేయడంతో ఆందోళన
మంచిర్యాల, వెలుగు : స్టాక్ మార్కెట్ ట్రేడింగ్పేరుతో కోట్లు కొల్లగొట్టిన అంకుర కార్పొరేట్ సొల్యూషన్స్ సీఈఓ గుండ సురేశ్ పది రోజులుగా అడ్రస్ లేకుండా పోయాడు. హైదారాబాద్‌లో తనఆఫీసుకు తాళంవేసి పారిపోవడంతో బాధితులు మంచిర్యాల విద్యానగర్‌లోని వారి ఇంటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల వరకు మోసపోయిన బాధితులు వరంగల్ సిటీ, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అది అది సివిల్ కేసు అని, పోలీసులు కంప్లయింట్ తీసుకోలేదని బాధితులు వాపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన గుండ సురేశ్ సీఏ డ్రాపౌట్. అనంతరం స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా మారాడు. అతడు హైదరాబాద్‌లో సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటూ మూడేండ్ల కిందట మీడియాలో కథనాలొచ్చాయి. 2018లో అంకుర ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను ప్రారంభించిన సురేశ్.. తన సేవలను కస్టమర్లు నమ్ముతున్నట్టు గ్రహించి తానే ట్రేడర్‌గా మారాలనుకున్నాడు. 2019లో అంకుర కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి జూబ్లీహిల్స్‌లోని వెస్ట్ఎండ్ మాల్లో ఆఫీసు ప్రారంభించాడు. హైదరాబాద్, వరంగల్ కు చెందిన యువకులకు ఉద్యోగాలు ఇచ్చాడు. వారికే డైరెక్టర్ హోదా కల్పించి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించాడు.
కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అప్పులు చేసిండు
స్టాక్ ట్రేడింగ్‌లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని, 5 నుంచి 10 శాతం వడ్డీ ఇస్తానని ఇన్వెస్టర్లను సురేశ్ ఆకర్షించాడు. మంచిర్యాల, హైదరాబాద్‌లో తనకు కోట్ల విలువైన భూములు, స్థిరాస్తులు ఉన్నాయని నమ్మించాడు. అలా తనతో పాటు తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, ఫ్రెండ్స్ దాదాపు 500 మంది దగ్గర రూ.100 వంద కోట్లకు పైగా అప్పులు చేశాడు. మూడేండ్లలో అప్పు తీరుస్తానని, వడ్డీ చెల్లిస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. వారికి తన కంపెనీ పేరిట బాండ్లు, చెక్కులు ఇచ్చాడు. అయితే, నాలుగైదు నెలలుగా ఎవరికీ చెల్లింపులు చేయలేదు. వడ్డీ పైసలు అడిగిన వారికి తనకు హెల్త్ బాగాలేక మంచిర్యాల వెళ్తున్నానని, ఈనెల 8న అందరికీ డబ్బులు ఇస్తానని చెప్పాడని బాధితులు తెలిపారు. తీరా సురేశ్ ఫోన్ కలవకపోవడం, జూబ్లీహిల్స్‌లోని ఆఫీసు మూసేయడం, ఇల్లు ఖాళీ చేయడంతో పలువురు బాధితులు మంచిర్యాల విద్యానగర్‌లోని అతని ఇంటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్టు అనుమానిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సురేశ్ బంధువులు, ఫ్రెండ్స్ సుమారు రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా పెట్టిన వారున్నారు. ఓ వ్యక్తి తాను చేస్తున్న బిజినెస్ మానేసి రూ.కోటి 30 లక్షలు సురేశ్ చేతిలో పెట్టినట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు, అతడి ఫ్రెండ్స్, బంధువులు మొత్తం 20 మంది సుమారు రూ.30 కోట్లకు పైగా అంకురలో ఇన్వెస్ట్ చేశారు. వారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. వరంగల్‌కు చెందిన ఒక యువకుడిని అంకుర సంస్థలో ఉద్యోగిగా నియమించుకున్న సురేశ్.. అతడికి డైరెక్టర్ హోదా కల్పించాడు. అతడి బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నాడు. కోట్లలో పెట్టుబడి పెట్టిన చాలా మంది ఇన్కమ్ టాక్స్ భయంతో బయటకు రావడం లేదు.