హైదరాబాద్: గాడిద పాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఏకంగా వంద కోట్లకు టోకరా ఇచ్చిందో సంస్థ. ఆన్లైన్లో ఒక్కో గాడిదను లక్షన్నరకు అమ్మేసింది. వాటిని జనం ఎగబడి కొన్నారు. లీటర్ గాడిద పాలను రూ. 1,600కు కొంటామని నమ్మ బలికింది. ఇలా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన వారికి గాడిదలను అంటగట్టింది. సీన్ కట్ చేస్తే ఆ సంస్థ గాయబ్ అయ్యింది. ఫ్రాంఛైజీ పేరుతో ఈ సంస్థ చేసిన మోసం ఏకంగా వంద కోట్లని తేలింది. తమిళనాడులోని తిరునాళ్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్ లైన్లో ఈ వ్యవహారాన్ని ప్రమోట్ చేసింది. జిల్లా కలెక్టర్తో గాడిదల ఫాం ప్రారంభించారు. సోనికా రెడ్డి, గిరి సుందర్, బాలాజీ శబరినాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేశారు. సోనికారెడ్డి అనే మహిళ యూట్యూబ్ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు.
కొవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి సంప్రదించారు. డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్ రమేశ్ బృందం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క రైతు వద్ద రూ.5లక్షలు తీసుకున్నారు. ఒక్కో పాడి గాడిదను రూ.80వేల నుంచి రూ.1.50లక్షల చొప్పున విక్రయించారు. వాటి సంరక్షణ బాధ్యతను అక్కడి రైతులకు అప్పగించారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు.
గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమ లాగా రూ.100 కోట్ల వరకు నష్టపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని చెప్పారు.
ALSO READ | నిండా ముంచేశాడు : రెండేళ్లలో మీ డబ్బులు డబుల్.. 300 కోట్లు మోసం చేసిన పవన్ కుమార్ అరెస్ట్
ఈ విషయంపై చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఒప్పందం సందర్భంగా ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని తేలిందన్నారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.