
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్, ఎంబీఎస్ గ్రూప్ సంస్థల్లో మంగళవారం రెండోరోజూ ఈడీ తనిఖీలు చేసింది. లెక్కల్లో చూపని రూ.100 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు సీజ్ చేసింది. బంజారాహిల్స్ షోరూమ్‌లో సీజ్ చేసిన ఈ బంగారాన్ని ట్రంకు పెట్టెల్లో అబిడ్స్‌లోని ఎస్‌బీఐకి తరలించింది. ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేసింది. మనీలాండరింగ్, ఫెమా కేసుల్లో హైదరాబాద్ సహా విజయవాడ, గుంటూరులోని ముసద్దిలాల్ షోరూమ్ లలో ఈడీ సోమవారం నుంచి సోదాలు చేపట్టింది.
బంగారం కొనుగోళ్లు, షోరూమ్స్ లో ఉన్న స్టాక్‌పై వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే పన్ను చెల్లింపుల్లో తేడాలు, లెక్కల్లో లేని బంగారాన్ని గుర్తించినట్లు తెలిసింది. డైరెక్టర్లు సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తాలు బినామీల పేర్లతో రూ.50 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కాగా, బయ్యర్ క్రెడిట్ స్కీమ్ కింద మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి గతంలో ముసద్దిలాల్ సంస్థ రూ.504 కోట్ల బంగారం కొనుగోలు చేసింది. ఇందులో భారీగా అక్రమాలు జరిగినట్లు 2014లో సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. పోయినేడాది రూ.300 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.