వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ కు సీతారామ ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీరు అనుసంధానం చేసేందుకు ప్రత్యేక కాల్వ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేసిందని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం వైరా రిజర్వాయర్ ను ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా పువ్వాళ్లతో కలిసి ఆయన మాట్లాడారు. కాల్వ కనెక్షన్ పనులకు వైరా రిజర్వాయర్ ఆనకట్ట వద్ద బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వైరా రిజర్వాయర్ లో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నింపడంతో ఆయకట్టు రైతులకు నిరంతరం సాగునీరు, 12 మండలాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు.
రిజర్వాయర్ ఆనకట్ట వద్ద శంకుస్థాపన సభా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు దాసరి దానియేలు, కట్ల రంగారావు, మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి), కట్ల సంతోష్, పమ్మి అశోక్, ఏదునూరి సీతారాములు, దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, బోళ్ల గంగారావు, కన్నెగంటి నగేశ్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.