- విద్యారంగంపై సమావేశాలు.. సమీక్షలు
- 257 విద్యాసంస్థల్లో పర్యటన.. 3 రాష్ట్రాల సందర్శన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ కు వంద రోజులు పూర్తయ్యాయి. విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు సెప్టెంబర్ 3న విద్యా కమిషన్ఏర్పాటైంది. చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించగా, సభ్యులుగా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేశ్, కె.జ్యోత్స్నకు అవకాశం కల్పించారు. కమిషన్ ఏర్పాటైన 100 రోజుల్లో నిత్యం అధికారులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు.. ఇలా అందరితో సమావేశాలు, సమీక్షలతో కమిషన్ బిజీబిజీగా మారిపోయింది.
అంగన్ వాడీల నుంచి యూనివర్సిటీల వరకూ అన్ని రకాల విద్యాసంస్థలను కమిషన్ సందర్శించింది. ఈ వంద రోజుల కాలంలో 257 విద్యాసంస్థల్లో పర్యటించింది. ఎన్జీవోలు, పౌరసమాజ సంస్థలతో 13 సమావేశాలు, టీచర్లు.. లెక్చరర్లు, ప్రొఫెసర్ల సంఘాలతో 12 మీటింగ్లు నిర్వహించింది.
ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్ అధికారులతో కమిషన్ అధికారులు 2 సార్లు భేటీ అయ్యారు. 3 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించగా, ఉన్నతాధికారులతో 2 సార్లు మీటింగ్ నిర్వహించారు. 3 రాష్ట్రాల్లో పర్యటించారు. జిల్లాస్థాయి అధికారులతో 4 సార్లు సమావేశాలు జరగ్గా, సలహా కమిటీతో ఒకసారి మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఫీజుల కట్టడిపై విద్యా కమిషన్ సమీక్ష జరుపుతున్నది.