అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ బాంబు పేలుడు సంభవించింది. షియా తెగకు చెందిన మసీదులో జరిగిన ఈ విధ్వంసంలో సుమారు 100 మందికి పైగా మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులో వందల మంది శుక్రవారం ప్రార్థనల్లో ఉండగా ముష్కరులు బాంబు పేలుడుకు పాల్పడ్డారని అఫ్గాన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యులుగా ఏ టెర్రర్ గ్రూప్ ప్రకటించుకోలేదు. పేలుడు తర్వాత మసీదులో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన అనేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పేలుడు విషయాన్ని తాబిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముహజిద్ ధ్రువీకరించాడు. ‘‘ఈ రోజు మధ్యాహ్నం కుందుజ్ ప్రావిన్స్‌లోని బండార్ సిటీలో షియా తెగ మసీదులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపారు. ఈ ఘటనపై తాలిబాన్ ఫోర్సెస్ దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉన్న షియా తెగ ముస్లింలను ఎప్పటి నుంచో ఐఎస్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల తాలిబాన్లు అఫ్గాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కాబూల్ ఎయిర్‌పోర్ట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు చేసిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడి కూడా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.