
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత 33% ఉందని.. జాతీయ స్థాయి సగటు కన్నా ఇది ఎక్కువని చెప్పారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలతో పాటు..యూనిఫామ్స్ ను అందిస్తామని చెప్పారు. వారికి షూ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు సీఎం జగన్.