కామారెడ్డిలో కేసీఆర్​పై పోటీకి 100 నామినేషన్లు

  • మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల నిర్ణయం
  • ప్రతి గ్రామానికి వెళ్లి మాకు జరిగే నష్టాన్ని వివరిస్తాం
  • కేసీఆర్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం
  • మాస్టర్ ప్లాన్​ రద్దు చేశాకే సీఎం రావాలని డిమాండ్
  • భవిష్యత్​ కార్యాచరణపై చర్చించిన ఏడు గ్రామాల రైతు ప్రతినిధులు 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు మళ్లీ పోరుబాటకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్​పై పోటీకి 100 మంది బాధిత రైతులు నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ‘మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ’ ఆధ్వర్యంలో మంగళవారం ఏడు గ్రామాల ప్రతినిధులు లింగాపూర్​లో సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ అంశం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ భూములు కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే నామినేషన్ వేసే ఆలోచన విరమించుకుంటామని ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని ప్రకటించిన తర్వాతే కేసీఆర్ కామారెడ్డిలో అడుగు పెట్టాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాలేదని, తమ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ను అనవసరంగా బద్నాం చేస్తున్నారని అసెంబ్లీలో కేటీఆర్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మాస్టర్ ప్లాన్​పై కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అందుకే, తాము ఉద్యమబాట పట్టామని వివరించారు. రైతులకు రాజకీయం ముఖ్యం కాదని, తమ భూములు అని స్పష్టం చేశారు. 

భూములే నమ్ముకుని బతుకుతున్నం

కొన్ని తరాలుగా భూములను నమ్ముకుని బతుకుతున్నామని రైతు ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డిలో పని ఉండటంతోనే అక్కడకు వెళ్తున్నట్లు ఇటీవల గజ్వేల్ కార్యకర్తలతో నిర్వహించిన మీటింగ్​లో కేసీఆర్ అన్నారని వివరించారు. కేసీఆర్​కు కామారెడ్డిలో ఏం పని అని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ పోరాట సమయంలో రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడని, అలాంటి ఘటన రిపీట్ కాకముందే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున మొత్తం 100 నామినేషన్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు సంఘటితం అవుతామన్నారు. బాధిత గ్రామాల్లోని రైతుల కుటుంబాలు, బంధువులతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకు జరిగే నష్టాన్ని వివరిస్తామన్నారు. కేసీఆర్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. తమకు మద్దతు ఇచ్చే వారికే ఓటు వేస్తామన్నారు. ఐదు రోజుల పాటు బాధిత గ్రామాల్లో ప్రతి రోజూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.