- మరికొందరి పరిస్థితి సీరియస్
- సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఘటన
- బోరునీళ్లు కలుషితం కావడం వల్లే అంటున్న ఆఫీసర్లు
సూర్యాపేట/మేళ్లచెరువు, వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో డయేరియా ప్రబలింది. గ్రామంలోని పలు కాలనీల్లో రెండు రోజుల్లో 100 మందికి పైగా డయేరియా బారినపడ్డారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి ఇద్దరు చనిపోయారు. కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉందని మెడికల్ ఆఫీసర్లు తెలిపా రు. బోర్ వాటర్ కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓ పక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా డయేరియా అదుపులోకి రావడం లేదు. ఈ నెల 16న చింతలపాలెంలోని ముత్యాలమ్మ గుడి బజార్లో తొలి డయేరియా కేసు నమోదైంది. డయేరియా సోకిన మహిళ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది. ఆ తర్వాత 2 రోజుల పాటు జరిగిన జ్వరసర్వేలో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినా.. అవసరమైన మందులు లేకపోవడం వ్యాధి తీవ్రత పెరిగింది. తాగునీరు కలుషితమైందని స్థానికులు ఆందోళన చేసిన తర్వాతే ఆర్ డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 12 చోట్ల నీటి నమూనాలు సేకరించారు. గ్రామంలోని ఓ వాటర్ ప్లాంట్‌లో తక్కువ మోతాదులో బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండగా.. 3 బోరుబావుల నీటిలో బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు అంటున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన ఆఫీసర్లు
2 రోజుల కిందట గొంగరెడ్డి శేషిరెడ్డి, చింతల వీరభద్రయ్య డయేరియా బారినపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు. దీంతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సం బంధిత అధికారులపై సీరియస్ అయ్యారు. దీంతో జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. 36 బోరుబావుల నుంచి నీటి నమూనాలు సేకరించి బ్యాక్టీరియల్ టెస్టుకు పంపారు. గుడిమల్కాపురంలోని మిషన్ భగీ రథ స్కీమ్ నుంచి 6 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామానికి సప్లై చేయడానికి ఏర్పాట్లు చేశా రు. గ్రామంలో భగీరథ పైపులైన్‌ను త్వరలోనే చక్కదిద్దుతామని, బోరుబావులను, మినరల్ వాటర్ ప్లాంటులను సీజ్ చేస్తామని అధికారు లు తెలిపారు. ప్రజలంతా నీటిని వేడిచేసి చల్లా ర్చి తాగాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీపీఓ నారాయణ రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, మిషన్ భగీరథ ఎస్ఈ అరుణాకర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు.