- డీజిల్బస్సులకు బైబై చెప్పేందుకు ఆర్టీసీ సిద్ధం
- ప్రస్తుతం గ్రేటర్లో అందుబాటులో 100 బస్సులు
- డిసెంబర్ నాటికి మరో 500 బస్సులు తేవాలని నిర్ణయం
- దశలవారీగా రోడ్లపైకి 2,500 బస్సులు
హైదరాబాద్సిటీ, వెలుగు:గ్రేటర్హైదరాబాద్పరిధిలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న పాత డీజిల్ బస్సులన్నింటినీ దశల వారీగా తొలగించేందుకు ప్లాన్లు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిటీలో100 ఎలక్ట్రిక్బస్సులు తిరుగుతున్నాయి. డిసెంబర్నాటికి మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రేటర్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా సెంట్రల్ యూనివర్సిటీ డిపో పరిధిలో 69 బస్సులను తీసుకువచ్చి నడిపిస్తున్నారు. దశల వారీగా 2,500 బస్సులు తెచ్చి నడిపించాలని అనుకుంటున్నారు.
ఏ రూట్లో ఎన్ని బస్సులంటే..
సెంట్రల్యూనివర్సిటీ డిపో పరిధిలో ప్రవేశపెట్టిన 69 ఎలక్ట్రిక్ బస్సుల్లో సికింద్రాబాద్– పటాన్చెరు మధ్య 219 నంబర్రూట్లో19 బస్సులు, కొండాపూర్– సికింద్రాబాద్మధ్య 10 హెచ్రూట్లో 17, లింగంపల్లి– కోఠి మధ్య నడిచే 216 రూట్లో 13 బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్లో వయా సెంట్రల్ వర్సిటీ, ట్రిపుల్ఐటీ, గచ్చిబౌలి, కోఠి మీదుగా సర్వీస్నడుస్తోందని అధికారులు తెలిపారు.
లింగంపల్లి– మెహదీపట్నం 216కె/ఎల్ రూట్లో 10 బస్సులు వేశారు. ఈ రూట్బస్సులు గంగారం, ఆల్విన్కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా మెహిదీపట్నం వరకు నడుస్తాయి. జేఎన్టీయూ – మెహిదీపట్నం195 రూట్లో 5 బస్సులు వేయగా, ఇవి వేవ్రాక్మీదుగా జేఎన్టీయూ, మెహిదీపట్నం వరకూ నడుస్తాయి. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరిన్ని బస్సులను ప్రవేశ పెడతామని అధికారులు చెప్పారు.
రాబోయే రోజుల్లో జంటనగరాల్లో పూర్తిగా ఎలక్ట్రిక్బస్సులను నడిపే దిశలో అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.