- తొలి పోలింగ్ బూత్ మాలినిలో 92.5 శాతం
కాగజ్ నగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ఓటింగ్ లో సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. సిర్పూర్ నియోజకవర్గంలో 320 పోలింగ్ కేంద్రాలుండగా కేవలం ఒకేఒక్క బూత్‌లో 100 శాతం పోలింగ్ నమోదైంది. ఇది కూడా కొత్తగా ఏర్పాటు చేసిన అగ్జీలరీ పోలింగ్ కేంద్రం కావడం విశేషం. బెజ్జూర్ మండలం రేచినిలోని 225/ఏ పోలింగ్ బూత్ లో 133 మంది ఓటర్లుండగా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర తొలి ఓటర్ పోలింగ్ కేంద్రం కాగజ్‌నగర్ మండలం మాలిని లో 92.54 శాతం ఓటింగ్ నమోదైంది. పల్లెల్లో గిరిజనులు ఉత్సాహంగా ఓటేయగా.. కాగజ్ నగర్ పట్టణంలోని 80వ నంబర్ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 41.72 శాతం మాత్రమే నమోదైంది.