300 ఆస్తులకు వెయ్యి ఎకరాల పరిహారం

  •      7 జిల్లాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్న హెచ్ఎండీఏ
  •     ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఏరియాలో చేపడుతున్న ఎలివేటెడ్ ​కారిడార్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం హెచ్ఎండీఏ అధికారులు భారీ మొత్తంలో భూములను సేకరిస్తున్నారు. రక్షణ శాఖకు చెందిన 168.55 ఎకరాల్లోని  300 ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. వీటికి పరిహారంగా హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట)ని 1000 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షణ శాఖకు ఇచ్చేందుకు ప్లాన్​చేస్తోంది.

 సికింద్రాబాద్​జింఖానా గ్రౌండ్​నుంచి నుంచి హకీంపేట ఎయిర్​పోర్ట్​స్టేషన్, తూంకుంట, శామీర్​పేట మీదుగా ఓఆర్ఆర్ వరకూ ఎలివేటెడ్​కారిడార్​నిర్మాణం జరగనుంది. అలాగే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్​పల్లి డెయిర్​ఫామ్​రోడ్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్​నిర్మించనున్నారు. ఈ రెండింటి నిర్మాణంలో రక్షణ శాఖకు చెందిన 300 ఆస్తులు, ప్రైవేట్​వ్యక్తులకు చెందిన 200 ఆస్తుల(83.72 ఎకరాలు)ను హెచ్ఎండీ అధికారులు సేకరిస్తున్నారు. 

ఇప్పటికే ప్రైవేట్ ఆస్తులపై మార్కింగ్​చేశారు. త్వరలోనే యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఆ వెంటనే భూ సేకరణ షురూ కానుంది. ప్రైవేట్​వ్యక్తులకు టీడీఆర్(ట్రాన్స్​ఫర్​డెవలప్​మెంట్​రైట్స్) స్కీమ్​ను అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ఎలివేటెడ్​కారిడార్​నిర్మాణంలో కోల్పోయిన భూమి మినహా, మిగిలి ఉన్న భూమిలో ప్రస్తుతం ఉన్న దాని కంటే నాలుగు రెట్లు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం లభిస్తుంది. 

ఇప్పటివరకు కంటోన్మెంట్​పరిధిలో భారీ భవనాలకు అనుమతులు లేవు. టీడీఆర్ అమలు చేస్తే నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. మరోవైపు నష్టపరిహారం అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రూ.1,580 కోట్ల అంచనాతో డబుల్​డెక్కర్​కారిడార్​ను మొత్తం 5.32 కి.మీ మేర నిర్మించనున్నారు. జేబీఎస్​ నుంచి హకీంపేట మీదుగా శామీర్​పేట ఓఆర్​ఆర్​వరకు11.12 కి.మీ. మేర ఎలివేటెడ్​కారిడార్​ను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2,232 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.