- గత ప్రభుత్వ హయాంలో 2 వేల ఎకరాలు స్వాహా చేసిన బీఆర్‌ఎస్ లీడర్లు
- ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన 250 ఎకరాల భూములు వెనక్కి
- రైతు బంధు రూపంలో అనర్హుల ఖాతాలోకి రూ.10 కోట్లు
- 250 ఎకరాలకు సంబంధించిన రూ.కోటిన్నర రైతు బంధు రికవరీకి చర్యలు
- మిగతా భూముల స్వాధీనంపై కొనసాగుతున్న ఎంక్వైరీ
కరీంనగర్, వెలుగు : సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ లీడర్లు స్వాహా చేసిన అసైన్డ్, సర్కార్ భూముల లెక్క తేల్చే పనిలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం బిజీ అయింది. సుమారు 2 వేల ఎకరాల భూములపై బీఆర్‌ఎస్ లీడర్లు లావణి పట్టాలు పొందగా.. ఆ భూముల విలువ రూ. రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.
ఇందులో ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా విలువైన 250 ఎకరాల భూములను వెనక్కి తీసుకోగా.. మిగతా భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. మరో వైపు ఈ భూములపై తీసుకున్న రైతుబంధు డబ్బులను సైతం రికవరీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లు, వారి అనుచరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
విలువైన భూములే టార్గెట్
సిరిసిల్ల నియోజకవర్గంలో విలువైన భూములే టార్గెట్‌గా బీఆర్‌ఎస్ లీడర్లు భూకుంభకోణానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఫస్ట్, సెకండ్ పొజిషన్‌లో అసైన్డ్ భూములను గుర్తించి, అసైనీల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు భూములు కొట్టేశారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి విలేజ్‌కి చెందిన కోల ఎల్లవ్వకు చెందిన సర్వే నంబర్ 164/3లోని మూడు ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను ఇలాగే కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్లవ్వ కూతురి పెండ్లి ఉండడంతో బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధర చెల్లించి భూమిని కొన్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భార్య హైమావతి పేరిట ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలోని సర్వే నంబర్ 119/4లో పట్టా పొందిన 3.20 ఎకరాల విలువ సుమారు రూ.కోటికిపైగా ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో ఒక్కో బీఆర్‌ఎస్ లీడర్ భూముల దందాతో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మేర లబ్ధి పొందారని ఆఫీసర్లు గుర్తించినట్లు సమాచారం.
రైతు బంధు రూపంలో అనర్హులఖాతాల్లోకి రూ.10 కోట్లు
సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 2 వేల ఎకరాల అసైన్డ్, సర్కార్ భూములు అన్యాక్రాంతమైనట్లు ఇటీవల ‘వీ6 వెలుగు’లో స్టోరీ పబ్లిష్ కావడంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా స్వయంగా ప్రకటించారు. ఆ భూములకు రైతు బంధు పేరిట ఇప్పటివరకు రూ. 10 కోట్లు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 2 వేల ఎకరాలకు సంబంధించిన అక్రమాల లెక్క తేలితే
రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరం కావడంతో పాటు రూ.10 కోట్ల రైతుబంధు సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 250 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు రూ.కోటిన్నరను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేసేందుకు ఆఫీసర్లు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.