వెయ్యి స్తంభాల మండపం రెడీ.. ఓరుగల్లులో 17 ఏండ్ల తర్వాత అందుబాటులోకి..

  • వెయ్యి స్తంభాల మండపం రెడీ 
  • ఓరుగల్లులో 17 ఏండ్ల తర్వాత అందుబాటులోకి..
  • అభివృద్ధి పేరుతో 2006లో పిల్లర్లను విప్పి కుప్పబెట్టిన్రు
  • 10 ఏండ్ల పాటు పట్టించుకోని కేసీఆర్‍ సర్కార్‍ 
  • కేంద్ర టూరిజం మంత్రి కిషన్‍రెడ్డి చొరవతో పనులు స్పీడప్​
  • త్వరలోనే పున:ప్రారంభానికి ఏర్పాట్లు 

వరంగల్‍, వెలుగు : కాకతీయ కళాసంపదకు కేరాఫ్‍గా, ఓరుగల్లుకు సెంటర్​ఆఫ్​ది అట్రాక్షన్​గా ఉండే  వెయ్యిస్తంభాల గుడి మండపం ఎట్టకేలకు17 ఏండ్ల తర్వాత అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే  పున:ప్రారంభించేలా తుది దశ పనులు చకచకా జరుగుతున్నాయి. రోజూ పూజలందుకునే రుద్రేశ్వరుని ఆలయంలో భక్తులు, టూరిస్టులను ఆకర్షించే కల్యాణ మండపాన్ని అభివృద్ధి పేరుతో 2006లోనే విప్పారు. అయితే, పాలకుల మద్దతు లేకపోవడంతో తిరిగి నిర్మించడంలో చాలా ఆలస్యమైంది. ఆంధ్రా పాలకులవల్లే వెయ్యి స్తంభాల ఆలయం పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం పెద్దలు..10 ఏండ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినా..గడువుల మీద గడువులు పెట్టారు తప్ప పని మాత్రం పూర్తి చేయించలేకపోయారు. ఈ క్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‍రెడ్డి తన వరంగల్‍ పర్యటనలో కల్యాణ మండప పనులు చేయించే బాధ్యతలను తన భుజన వేసుకున్నారు. కావాల్సిన నిధులు కేటాయించడంతో పాటు అధికారులు, శిల్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా పనులను స్పీడప్‍ చేశారు. ఈ నెలలోనే అభివృద్ధి చేసిన వెయ్యి స్తంభాల మండపాన్ని టూరిస్టులకు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తున్నారు. 

వెయ్యి ఏండ్లు ఉండేలా..వెయ్యిస్తంభాల గుడి నిర్మాణం

ఓరుగల్లు కాకతీయుల పాలన కాలంలో ఒకటో రుద్రుడు 1163లో నిర్మించిన అద్భుత కట్టడమే ఈ వెయ్యిస్తంభాలగుడి. 1400 మీటర్ల  వైశాల్యంలో..శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఉన్న ఆలయం ఇది. ఇక్కడి ప్రతి రాయి లయబద్ధమైన సంగీతం అందించే వాయిద్యంగా ఉండేది. శిలలపై సప్తస్వరాలు పలికించిన ఘనత నాటి కళాకారులకు దక్కింది. సైన్స్ అండ్‍ టెక్నాలజీ, టన్నులకొద్దీ బరువులెత్తే మెషీన్లు అందుబాటులో లేకున్నా..వెయ్యి ఏండ్ల పాటు చెక్కుచెదరకుండా నిర్మించారు. దీనికోసం డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలను వాడారు. వానలు, వరదల కారణంగా మండపంలోని కొన్ని పిల్లర్లు కుంగాయి తప్పితే.. శిల్ప సంపద చెక్కుచెదరలేదు. 

2004లో ‘వర్షం’సినిమాతో మరింత ఫేమస్‍

వెయ్యిస్తంభాల ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నా 2004లో వచ్చిన ‘వర్షం’ సినిమా ఇక్కడి శిల్ప సంపదను జనాలకు సరికొత్తగా పరిచయం చేసినట్లయ్యింది. ఆనాడు ఇదే కల్యాణ మండపంలో పలు సీన్లు, పాటలు షూట్‍ చేశారు. సినిమా చూసిన అభిమానులు ఈ ప్రాంతాన్ని చూడడానికి అప్పట్లో ఎంతో ఉత్సాహం చూపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఇక్కడ సినిమా షూట్‍ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. దీంతో ‘అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి’, నా ఆటోగ్రాఫ్‍ స్వీట్‍ మెమొరీస్‍, సోగ్గాడు, వీర తెలంగాణ, రుద్రమదేవి, తదితర 17 నుంచి 20 తెలుగు సినిమాలు, 5 హిందీ, మరో రెండు తమిళ మూవీలు ఇక్కడ షూటింగ్‍ జరుపుకున్నాయి. తీరా..పర్యాటకుల సంఖ్య పెరిగే క్రమంలో 2006లో కల్యాణ మండపానికి రిపేర్లు, అభివృద్ధి పేరుతో శిలా స్తంభాలను విప్పారు. దీంతో జనాలతో పాటు సినిమా వాళ్లు కూడా ఇటువైపు రావడం బంద్‍  పెట్టారు.

15 ఏండ్లుగా.శ్మశానవాటిక పక్కన శిల్పాలు

వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండప నిర్మాణంలో తొలగించిన శిల్ప సంపదను హనుమకొండ పద్మాక్షి టెంపుల్‍కు దగ్గరలో ఉండే శ్మశానవాటిక పక్కన పెట్టారు. ఏడాదో.. రెండేండ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పిన పాలకులు 15 ఏండ్ల పాటు ముళ్ల కంపల్లోనే వాటిని ఉంచారు. అప్పట్లో తమిళనాడుకు చెందిన శిల్ప కళాకారుడు స్తపతి శివకుమార్ ఈ పనులను మొదలుపెట్టినా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది. పిల్లర్లను తిరిగి గతంలో మాదిరి బిగించేందుకు గుర్తుగా శిల్పాలపై రంగులతో నంబర్లు వేశారు. ఏండ్లపాటు ఎండకు ఎండి..వానకు తడవడంతో రంగుల గుర్తులు పోయాయి. ఈ క్రమంలో నాడు తీయించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా మళ్లీ పనులు మొదలుపెట్టాల్సి వచ్చింది.

కేంద్రమంత్రి కిషన్‍రెడ్డితో చొరవతో..

ములుగు జిల్లా రామప్ప టెంపుల్‍ యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కిషన్‍రెడ్డి కల్యాణ మండపం దుస్థితిని తెలుసుకున్నారు. అప్పటికే 15 ఏండ్లు గడవడాన్ని సీరియస్‍ తీసుకున్నారు. 2022 ఏప్రిల్‍ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో కలిసి వెయ్యిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు, సమస్యలు పూర్తిగా తెలుసుకుని.. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చారు. గతంలో ఖర్చయిన నిధులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఎంత అవసరమున్నా ఫండ్స్ ఆపే ప్రసక్తి లేదని మాటిచ్చారు. పనులను చేస్తున్న శిల్పి శివకుమార్‍ టీంతో ప్రత్యేకంగా మాట్లాడి..తిరిగి పనులు మొదలుపెట్టేలా చొరవ తీసుకున్నారు. దీంతో శ్మశానవాటిక ముళ్లకంపల్లో ఉన్న శిల్ప సంపదకు ప్రాణం వచ్చినట్లయింది. పనులు మొదలుపెట్టడమే కాకుండా స్పీడప్‍ చేశారు. అభివృద్ధి చేసిన శిల్పాలను గతంలో మాదిరిగా ఎక్కడికక్కడ బిగించారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. పై భాగంలో స్లాబ్‍ నిర్మాణానికి తోడు చిన్నపాటి వర్క్స్​చేయాల్సి ఉంది.  వీలైతే.. మహా శివరాత్రి లోపు లేదంటే పార్లమెంట్‍ ఎలక్షన్లలోపు కల్యాణ మండపాన్ని పున:ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయి.

రేపు మాపంటూ 10 ఏండ్లు గడిపిన కేసీఆర్‍ సర్కార్‍

వెయ్యిస్తంభాల కల్యాణ మండప పనుల కోసం సెంట్రల్‍ ఆర్కియాలజీ  డిపార్టుమెంట్​రూ.7.5 కోట్లు కేటాయించింది. స్తపతి శివకుమార్​ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మొదలుపెట్టారు. రెండేండ్లలో పూర్తిచేయాలని టైం పెట్టుకున్నారు.  15 ఏండ్లు గడిచాయి తప్పితే  పనులు మాత్రం పూర్తి కాలేదు. అప్పట్లోనే అనుకున్న బడ్జెట్ కంటే మరో రూ.6 కోట్ల వ్యయం పెరిగింది. ఈ డబ్బులను సెంట్రల్‍ ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. అప్పటివరకు చేసిన పనులకు సంబంధించి ఖర్చుల  వివరాలు పంపిస్తే..బడ్జెట్‍ రిలీజ్‍ చేస్తామని చెప్పారు. అయితే, సమైక్యాంధ్ర ప్రభుత్వ పెద్దలవల్లే వెయ్యిస్తంభాల కల్యాణ మండప పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని కేసీఆర్‍, కేటీఆర్‍ మొదలు.. అప్పటి ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్‍ వరకు ఎంతోమంది విమర్శించారు తప్పితే..రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేసిన లెక్కలను పంపడంలో విఫలమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పనులు చేయడంవల్లే వాటిని ఇవ్వలేదనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.