దేశంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను దేశవ్యాప్తంగా పలువురు ఎంపీలు అధికారికంగానే దత్తత తీసుకున్నారు. ఇందులో కనీసం 90 శాతం గ్రామాలను సంబంధిత ఎంపీ కనీసం కన్నెత్తి చూడటం లేదు. ముందు ఎంతో ఉత్సాహంగా గ్రామాన్ని దత్తత తీసుకున్నవారు అక్కడ పనులు ఏమి జరిగాయో కూడా చూసిన పాపానా పోలేదు. ఉత్తరప్రదేశ్, హర్యానా, బెంగాల్, జార్ఖండ్, బిహార్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, గోవా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎంపీలు ముందు ఉత్సాహంతో, ఆసక్తిగా దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత తగిన శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేశారు.
అయితే 10 శాతం గ్రామాలలో ఆయా ప్రాంతాల ఎంపీల వల్ల కొంత అభివృద్ధి జరిగింది. కానీ, వంద శాతం మాత్రం జరగలేదు. అందరికీ ఇండ్లు, 24 గంటల విద్యుత్, కనీస అవసరాలు ఇవేమీ ఆశించిన మేరకు నెరవేరలేదు. మొత్తం పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు 703 మంది వరకు 1000 గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఇందులో 99 శాతం గ్రామాల్లో రూల్ ఆఫ్ లా లేదు. ఆర్థికపరమైన బలం లేదు. ఉపాధి, వ్యవసాయానికి అవసరమైన భూమి 90 శాతం మందికి లేదు. భూమి ఉంటే వ్యవసాయానికి అనువైన పరిస్థితి లేదు. తాగడానికి పరిశుద్ధమైన నీళ్లు లేవు. వైద్యం, విద్యా సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు.
ఆదర్శ గ్రామాలు నీటిమూటలు
స్మార్ట్ సిటీలు, ఆదర్శ గ్రామాల మాటలన్నీ నీటి మూటలే. 2014 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి కారణాల చేత దేశంలోని 80 శాతం ఎంపీలు గ్రామాలకు, తమ నియోజకవర్గాలకి వెళ్లి జనాన్ని పలకరించే ధైర్యం చేయలేకపోతున్నారు. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాల్లోనే ఉంటూ కనీసం 20 గ్రామాల్లో పర్యటించినవారు 20 శాతం కన్నా ఎక్కువ లేరు. ప్రతి నియోజకవర్గంలోని అసెంబ్లీ హెడ్ క్వార్టర్ లేదా మండల, తహసీల్దార్ పరిధిలోని హెడ్ క్వార్ట
ర్లకు వీరు వెళ్లడమే గగనం అంటే అతిశయోక్తి కాదు.
అది కూడా మంత్రి లేదా ఆ స్థాయి ప్రజా ప్రతినిధి, ఉన్నత అధికారి వచ్చినపుడు ఏదైనా ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన ఉన్నపుడు తప్ప ఎంపీలు ప్రజలకు కనిపించరు. ఇదీ క్షేత్రస్థాయిలో ఉన్న నిజం. 140 కోట్లకు పైగా జనాభాగల దేశంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేసి 80 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా 5 కేజీల రేషన్ ఇస్తోంది. బడ్జెట్లో ప్రతిసారి 15 శాతం పెంచుతున్నది. రెవెన్యూ, ఖర్చు నడుమ అంతరం 9 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఆ అంతరం 2023 చివరికల్లా 16 లక్షల 61,000 కు చేరుకున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
అదుపు తప్పిన ద్రవ్యోల్బణం
దేశ ఆర్థిక పరిస్థితి సత్వరం బాగుపడే పరిస్థితి లేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి ఆర్బీఐ చేయి దాటింది. రెవెన్యూ పెరిగినా, ఖర్చు పెరగడం, అవినీతి, అక్రమాలు పెరగడం, ఆర్థిక పరమైన కంట్రోల్, పొదుపు లేకపోవడం, పీఎం సహా మంత్రుల లగ్జరీ ఖర్చులు పెరగడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పట్లో గాడికి వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టుల పూర్తి నిర్దేశిత సమయం దాటిపోవడం వల్ల బడ్జెట్లో ప్రతిపాధిత నిధుల ఖర్చులు పెరిగాయి. ఫలితంగా 100కు పైగా ప్రాజెక్టుల పనులు సక్రమంగా జరగడం లేదు. సిమెంట్, స్టీల్, విద్యుత్, బొగ్గు ధరలు పెరిగిన భారం ప్రాజెక్టుల మీద పడింది.
5 ట్రిలియన్ల ఎకానమీ, విశ్వగురు లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న పాలకులు.. కనీసం నిత్యం జనజీవితంతో సంబంధం ఉన్న నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కష్టపడి పనిచేసే శక్తి ఉన్న 45 కోట్ల మందికి ఉపాధి చూపే పరిస్థితి లేదు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది?. దేశంలో కనీసం సొంతం ఇల్లు లేని కుటుంబాలు 60 శాతంపైనే ఉంటాయి. అసమానతలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీలు దత్తత గ్రామాలను చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలి.
- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్