- 5 నెలల తర్వాత హయ్యెస్ట్
- ముంబైలో వెయ్యి పైనే కరోనా కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. కొన్ని రోజులుగా రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువైతున్నయ్.. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రం మొత్తం మీద 10,216 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. వైరస్ కేసులు తీవ్రంగా ఉన్న టైమ్‌లో కిందటేడాది అక్టోబర్ 17న మహారాష్ట్ర మొత్తంగా 10,259 మంది వైరస్ బారిన పడ్డారు. తర్వాత నెమ్మదించిన వైరస్.. ఇటీవల మళ్లీ విజృంభిస్తోంది. ఐదు నెలల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య పదివేలను దాటింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడ్డోళ్ల సంఖ్య 21,98,399 కు చేరిందని అధికారులు చెప్పారు. బుధవారం కొత్తగా నమోదైన కరోనా కేసులు 9,855 కాగా గురువారం 8,998 మందికి వైరస్ అంటింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా చనిపోయినోళ్ల సంఖ్య 52,393 కాగా.. శుక్రవారం ఒక్కరోజే 53 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వైరస్ బారిన పడి కోలుకున్నోళ్ల సంఖ్య 20,55,951 కాగా.. శుక్రవారం నాడు 6,467 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పుడు 88,838 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.52 శాతం, డెత్ రేట్2.38 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 90,550 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 1,66,86,880 మందికి టెస్టులు చేశామని చెప్పారు.
ముంబైలో వెయ్యికి పైగా..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం 1,174 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. దీంతో సిటీలో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3,31,020 కు చేరిందన్నారు. వైరస్‌తో శుక్రవారం ముగ్గురు చనిపోవడంతో మొత్తంగా చనిపోయినోళ్ల సంఖ్య 11,495 కు చేరిందన్నారు.