Ranji Trophy 2025: కోహ్లీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. 10 వేల మందికి ఫ్రీ ఎంట్రీ

Ranji Trophy 2025: కోహ్లీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. 10 వేల మందికి ఫ్రీ ఎంట్రీ

టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మెడ నొప్పి కారణంగా సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమైన విరాట్..  జనవరి 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లీ ఆడడం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఢిల్లీలో జరగనున్న ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు కోహ్లీ పైనే ఉన్నాయి. అతని బ్యాటింగ్ చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ కు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 

కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కోహ్లీ రీ ఎంట్రీ మ్యాచ్ కు సీటింగ్ కెపాసిటీ పెంచడమే కాకుండా 10,000 మంది అభిమానులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది. దీనికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. 2012 లో విరాట్ కోహ్లీ చివరిసారిగా ఉత్తరప్రదేశ్ పై రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసి విఫలమైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

ALSO READ | PAK vs WI 2025: నోమన్ అలీ హ్యాట్రిక్.. తొలి పాక్ స్పిన్నర్‌గా సరికొత్త చరిత్ర

2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది.