తెలంగాణలో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఆర్డర్లు

తెలంగాణలో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఆర్డర్లు
  • వారిలో లాంగ్వేజీ పండిట్లు 4,910, పీఈటీలు 966 మంది
  • మిగిలిన ఎస్జీటీలకు పీఎస్​హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి 
  • కేటాయించిన స్కూళ్లలో జాయిన్ అయిన టీచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మల్టీజోన్1 పరిధిలో ఏకంగా 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు లభించాయి. ప్రమోషన్లు పొందిన టీచర్లు బుధవారం.. వారికి కేటాయించిన స్కూళ్లలో జాయిన్  అయ్యారు. దీంతో చాలా బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరినట్లు అయింది. టీచర్ల ప్రమోషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తల నేపథ్యంలో టీచర్లలో అయోమయం నెలకొనగా, ప్రమోషన్  ఆర్డర్లు అందడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

టీచర్ల ప్రమోషన్లకు టెట్  క్వాలిఫై తప్పనిసరి అనే  ఎన్​సీటీఈ నిబంధనతో గతంలో మధ్యలో ఆగిపోయిన ప్రమోషన్ల ప్రక్రియ.. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో  ఈనెల 8 నుంచి తిరిగి ప్రారంభమైంది. మల్టీజోన్1లో ఈ నెల 12న ఎస్జీటీ, దాని సమానమైన క్యాడర్  సీనియారిటీ లిస్టులను రిలీజ్  చేయగా, ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగించారు. ఈ నెల17న ప్రమోషన్, పోస్టింగ్  ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది. 

అయితే, మంగళవారం ఆర్డర్లు జారీచేసినా.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరికి మంగళవారం, ఇంకొందరికి బుధవారం ప్రమోషన్  ఆర్డర్లు ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన వారంతా బుధవారం కొత్తగా కేటాయించిన బడుల్లో చేరారు. మల్టీజోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో మొత్తం ఎస్జీటీ కేడర్​ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 10,083 మంది ప్రమోషన్లు పొందారు. వీరిలో 4,910 మంది లాంగ్వేజీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం) గా, 966 పీఈటీలకు స్కూల్  అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) గా ప్రమోషన్  ఆర్డర్లు ఇచ్చారు. 

మిగిలిన 4,207 మంది ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్  హెడ్మాస్టర్​గా, వివిధ సబ్జెక్టుల్లో స్కూల్  అసిస్టెంట్లు ప్రమోషన్  ఇచ్చారు. కాగా, వారం రోజుల క్రితం మల్టీజోన్ 2 పరిధిలో లోకల్  బాడీ స్కూళ్లలో పనిచేస్తున్న 776 మంది స్కూల్  అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు లభించాయి. ప్రస్తుతం వారంతా కొత్త బడుల్లో విధుల్లో చేరారు. 

టీచర్ల సంఘాల హర్షం..

ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియలో అనేక అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్ అధికారులు ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించడంపై టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ప్రమోషన్లు పొందిన టీచర్లకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా, 20 ఏండ్ల తర్వాత ల్యాంగ్వేజీ  పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్లు  కల్పించడంపై ఆర్ యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్, నర్సిములు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించడంపై పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చెన్నయ్య, బిక్షం గౌడ్, జాక్టో యూఎస్పీసీ నేతలు సదానందంగౌడ్, చావ రవి, లింగా రెడ్డి, ప్రకాశ్ రావు, సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్.. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్  శ్రీదేవసేన, అడిషనల్  డైరెక్టర్  లింగయ్యకు ధన్యవాదాలు తెలిపారు.

తొలిసారిగా ఆన్​లైన్​లో ప్రమోషన్ల ప్రక్రియ

ఈ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఆన్​లైన్​ లో నిర్వహించింది. చిన్నచిన్న లోపాలు మినహా.. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా సాగడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పోస్టు అప్​గ్రేడ్ అయినా ప్రమోషన్లు రాని పండిట్, పీఈటీలను తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. వారికి రెండు, మూడు రోజుల్లోనే స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు. ఒకటికన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రమోషన్లు పొందిన వారి వివరాలనూ డీఈఓల నుంచి సేకరించి, మిగిలిన ఖాళీల్లో తర్వాతి ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉన్నారు.