- శ్రీహరికోట నుంచి100వ రాకెట్ ప్రయోగం
- జీఎస్ఎల్వీ–ఎఫ్15 ద్వారా ఎన్వీఎస్02 శాటిలైట్ పంపనున్న ఇస్రో
- స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’లోకి చేరనున్న మరో ఉపగ్రహం
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ నెల 29న కీలక మైలురాయిని చేరుకోనుంది. వచ్చే బుధవారం ఉదయం జీఎస్ఎల్వీ-ఎఫ్15 మిషన్ తో రాకెట్ ప్రయోగాల్లో షార్ సెంచరీ పూర్తి చేసుకోనుంది.
షార్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జరిగే చరిత్రాత్మకమైన ఈ 100వ ప్రయోగంలో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’లోకి ఎన్ వీఎస్02 ఉపగ్రహాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అంతరిక్షానికి పంపనుంది.
ఇది ఓవరాల్ గా ఇస్రోకు 17వ జీఎస్ఎల్వీ మిషన్ కాగా, స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ తో కూడిన రాకెట్ ను ప్రయోగించడం 11వ సారి కానుంది. భారత భూభాగంతోపాటు చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకూ నావిగేషన్ సేవలను అందించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్టెల్లేషన్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
దీనిద్వారా 20 మీటర్ల కచ్చితత్వంతో జీపీఎస్ సేవలు అందనున్నాయి. నావిక్ వ్యవస్థలోకి ఇదివరకే ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్1ఈ శాటిలైట్ స్థానంలో సేవలు అందించేందుకుగాను 2,250 కిలోల బరువైన అధునాతన ఎన్వీఎస్ 02 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
ఇది సెకండ్ జనరేషన్ శాటిలైట్లలో రెండోదని, మొదటిదైన ఎన్ వీఎస్01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించామని తెలిపింది. మొదటిసారిగా దేశీయంగా తయారుచేసిన అటామిక్ క్లాక్ ను కూడా ఎన్ వీఎస్02లో అమర్చామని పేర్కొంది.