భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్​: తాకిందంటే ఓ సిటీ ఆనవాళ్లు కూడా దొరకవంటున్న నాసా

భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్​: తాకిందంటే ఓ సిటీ ఆనవాళ్లు కూడా దొరకవంటున్న  నాసా

2032లో భూమిని తాకే అవకాశం ఉందని వెల్లడి

న్యూయార్క్: అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతున్న ఓ ఆస్టరాయిడ్​ క్రమంగా భూమికి దగ్గరవుతోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22 న భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. 2024 వైఆర్4 గా వ్యవహరిస్తున్న ఈ ఆస్టరాయిడ్​ను సైంటిస్టులు 2023 డిసెంబర్ లోనే గుర్తించారు. అప్పట్లో ఇది భూమి వైపు వస్తున్న విషయం గుర్తించినప్పటికీ భూమిని తాకే అవకాశం కేవలం 1.2 శాతం మాత్రమే ఉండడంతో దీనిపై పెద్దగా దృష్టి సారించలేదన్నారు. ఈ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని, ఈ ఏడాది చివరి వారంలో 2.8 శాతానికి పెరిగిందని చెప్పారు. 

ఈ నెల 13న మరోసారి గ్రహశకలం కదలికలను పరిశీలించగా.. ఇది భూమిని ఢీ కొట్టే ముప్పు 3.2 శాతానికి పెరిగిందని కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది తన కక్ష్యలో సెకనుకు 17 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతోందని వివరించారు. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుండడం వల్ల కొన్ని రోజుల్లో ఈ గ్రహశకలం కనిపించకుండా పోతుందని, తిరిగి 2028లో కనిపిస్తుందని తెలిపారు. సుమారు 60 మీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ ఆస్టరాయిడ్​ కనుక భూమిని తాకితే ఆ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో భారీ విధ్వంసం తప్పదన్నారు. ఆస్టరాయిడ్​ ఏదైనా సిటీని ఢీ కొడితే అది నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. 

ఆ సమయంలో హిరోషిమాపై వేసిన అణుబాంబు కన్నా 500 రెట్లు అధికంగా ఎనర్జీ ఉత్పన్నమవుతుందని వివరించారు. అయితే, పరిస్థితి అంతదాకా రాదని, 2024 వైఆర్​4 ఆస్టరాయిడ్ 99% భూమికి సమీపంలో నుంచి వెళ్లిపోతుందన్నారు. ఢీ కొడుతుందని కచ్చితంగా తేలితే దానిని అడ్డుకుని దారి మళ్లిస్తామని నాసా పేర్కొంది.