
- 55.99 కోట్ల క్యాష్, 38.45 కోట్లు విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం
- కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే 647 స్పెషల్ టీమ్స్‌తో తనిఖీలు
- 5,529 గన్స్ డిపాజిట్, 17,128 మంది బైండోవర్
హైదరాబాద్, వెలుగు: స్టేట్‌లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు స్పెషల్ టీమ్స్‌తో జోరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది రోజుల్లోనే రూ.101.18 కోట్లు విలువ చేసే క్యాష్, గోల్డ్, లిక్కర్, డ్రగ్స్ ఇతర వస్తువులను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీలు, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను డీజీపీ కార్యాలయం మంగళవారం వెల్లడించింది.2018 ఎన్నికల సమయంలో రూ.103 కోట్లు సీజ్ చేయగా.. ఈ ఎన్నికల టైంలో కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.101.18 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 374 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 95 స్టేట్ ఇంటర్నల్ బోర్డర్ చెక్‌పోస్టులు, మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. 5,529 లైసెన్స్‌డ్ ఆయుధాలు, లైసెన్స్‌లు లేని మూడు గన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. 5,252 బైండోవర్ కేసులలో మొత్తం17,128 మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించింది. కోడ్‌ను ఉల్లంఘించిన 184 మందిపై 56 కేసులు నమోదు చేసినట్టు తెలిపింది.18 జిలెటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్స్, కార్డ్‌టెక్స్ వైర్ బండల్స్ ఆరు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.