- 17 మందికి గాయాలు
- త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న రైతు సంఘాలు
చండీగఢ్: కనీస మద్దతు ధర సహా 11డిమాండ్ల సాధన కోసం రైతులు శనివారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. మార్చ్ లో పాల్గొన్న 101 మంది రైతులను పంజాబ్~-హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని తిరిగి వెళ్లిపోవాలని రైతులకు సూచించారు. అయినా, రైతులు ముందుకే కదలడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్(బాష్పవాయువు), వాటర్ క్యానన్(జల ఫిరంగులు) ప్రయోగించారు. ఈ ఘటనలో 17 మంది రైతులకు గాయాలయ్యాయి.
తమ తోటివారు గాయాలపాలవ్వడంతో మార్చ్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. అంతర్గత సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నెల 6 నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ శనివారంతో కలిపి మూడోసారి వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. రైతుల పాదయత్రను పోలీసులు అడ్డుకోవడంపై రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మండిపడ్డారు.
పాదయాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని కోరారు. కాగా.. ఢిల్లీ మార్చ్ ను దృష్టిలో పెట్టుకొని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ రెండు నాల్కల ధోరణి ఏంటి?
శంభు సరిహద్దు వద్ద రైతుల ఢిల్లీ మార్చ్ ను పోలీసులు అడ్డుకోవడంపై స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత బజరంగ్ పునియా స్పందించారు. ప్రభుత్వానిది రెండు నాల్కల ధోరణి అని మండిపడ్డారు. "రైతులను అడ్డుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ వారిపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తోంది. శంభూను పాకిస్తాన్ సరిహద్దు అన్నట్లు వ్యవహరిస్తోంది" అని పేర్కొన్నారు.