సాయం కోసం పరుగెత్తితే కాల్పులు

గాజా/జెరూసలెం: పాలస్తీనాలో సాయం కోసం పరుగెత్తుకుంటూ వెళ్లిన వందలాది మందిపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గురువారం ఎయిడ్ ట్రక్కుల వద్దకు జనం పరుగెత్తుకుంటూ..అక్కడే ఉన్న ఇజ్రాయెల్ ట్యాంకుల సమీపంలోకి వెళ్లగా కాల్పులు జరిపారని తెలిపింది. ఈ ఘటనలో 104 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. అయితే, సాయం కోసం వెళ్లినవారిలో 104 మంది చనిపోవడంపై ఇజ్రాయెల్ మిలటరీ స్పందించింది. 

వారంతా తాము దాడి చేయటం వల్ల చనిపోలేదని.. సహాయక ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలోనే చనిపోయారని క్లారిటీ ఇచ్చింది. కాగా, ఇజ్రాయెల్-–హమాస్ యుద్ధం వల్ల ఇప్పటిదాకా 30 వేలకు పైగా  పాలస్తీనియన్లు మరణించారని, 70 వేల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్ దాడితో గాజా పూర్తిగా ధ్వంసం అయ్యింది. అక్కడి సౌలతులన్నీ దెబ్బతిన్నాయి. దాంతో ఇతర దేశాల నుంచి వస్తున్న మానవతా సాయం అందక గాజాలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు.