మెదక్, వెలుగు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 104 సిబ్బంది నాలుగు నెలలుగా జీతాల్లేక ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఏపీలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం అమలు కోసం అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించారు. కాగా ఏడాది కిందట గత బీఆర్ఎస్ ప్రభుత్వం 104 వాహనాల ద్వారా గ్రామాలకు వెళ్లి మందులు అందజేయడాన్ని నిలిపి వేసింది.
అందులో పనిచేసే సిబ్బందిని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ ఇతర సేవలకు వినియోగించుకుంటున్నారు. ల్యాబ్ టెక్నిషియన్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో, తెలంగాణ డయాగ్నోసిస్ హబ్‌లలో, ఫార్మాసిస్ట్లు స్టోర్లలో, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లలో, పీహెచ్సీలలో పనిచేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరమున్న దగ్గర వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల డీఎంహెచ్ఓల ఆధ్వర్యంలో దాదాపు 1,200 మంది 104 సిబ్బంది పని చేస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి పెండింగ్
ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తించే 104 సిబ్బందికి గతేడాది సెప్టెంబర్ నుంచి వేతనాలు రావడం లేదు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్లకు నెలకు రూ.22,750, డాటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, మల్టీపర్పస్‌హెల్త్ అసిస్టెంట్లకు రూ.19,500, సెక్యూరిటీ గార్డ్లకు రూ.15,600 జీతం చెల్లించేవారు. గతంలో రెండు నెలలకు ఒకసారి జీతాలు వచ్చేవని ఇప్పుడు నాలుగు నెలలైనా రావడం లేదని వాపోతున్నారు.
జనవరి నెలతో కలుపుకుంటే 5 నెలల జీతం చేతికందాల్సి ఉంది. జిల్లాలో 104 సిబ్బంది 30 మంది పనిచేస్తుండగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి బకాయిలు రూ.25 లక్షలు పేరుకు పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బకాయిలు కోట్లలో ఉంటాయి. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి డీఎంహెచ్ఓ లకు అవసరమైన నిధులు విడుదల చేసి ఇప్పించాలని కోరుతున్నారు.
ALSO READ : నల్గొండ ఎంపీ సీట్లపై వారసుల గురి!
బడ్జెట్ రాగానే చెల్లింపు
104 సిబ్బంది జీతాలు నాలుగు నెలలుగా పెండింగ్ ఉన్న విషయం వాస్తవమే. బడ్జెట్ రాకపోవడంతో జీతాలు చెల్లించలేకపోయాం. బడ్జెట్ రాగానే జీతాలు చెల్లిస్తాం.
చందు నాయక్, మెదక్, డీఎంహెచ్‌వో