- 3 కమిషనరేట్ల పరిధిలో 38,645 మంది పోలీసులతో బందోబస్తు
- ఏడు లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో అప్రమత్తం
- 5 వేల సీసీ కెమెరాలతో పోలింగ్ పర్యవేక్షణ
- కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్
హైదరాబాద్,వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియడంతో సిటీ పోలీసులు పోలింగ్‌పై ఫోకస్ పెట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కొనసాగిస్తారు. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డీఆర్‌సీ సెంటర్ల నుంచి ఈవీఎంలను తరలిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు సిబ్బందిని అలర్ట్ చేశారు.
బందోబస్త్ కు 38,645 మంది పోలీసులు
మూడు కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్‌సభసెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 4,496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బందోబస్తుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు. ఓటర్లలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ లు చేపట్టారు. నాఖాబందీలతో అక్రమ డబ్బుకు అడ్డుకట్ట వేశారు. ప్రచారం ముగిసే వరకు 3 కమిషనరేట్ల పరిధిలో రూ.34.44 కోట్లు నగదు పట్టుకోగా రూ.1.32 కోట్లు విలువైన మద్యం సీజ్ చేశారు.
సీసీ కెమెరాలతో నిఘా..
పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకొచ్చారు. దాదాపు 5,000 సీసీ కెమెరాలతో పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. 3,783 కేంద్రాల్లో 50 నుంచి 100 గజాలలోపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ చేశారు. పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఐటీ వింగ్‌ను నియమించారు. మౌంటెడ్ కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కి లింక్ చేశారు. ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా వెంటనే అలర్ట్ అవుతారు. అందుకు 4,000లకు పైగా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్‌లను సిబ్బందికి అందజేశారు. ఆదివారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.