లైబ్రరీ సెస్​రూ.1,064 కోట్లు పెండింగ్.. పదేండ్లుగా మెయింటెనెన్స్ బిల్లుతోనే సరి

లైబ్రరీ సెస్​రూ.1,064 కోట్లు పెండింగ్..   పదేండ్లుగా మెయింటెనెన్స్ బిల్లుతోనే సరి

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీ పరిధిలోని లైబ్రరీలకు పదేండ్లుగా సెస్​అందడం లేదు. జనం నుంచి ఎప్పటికప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న బల్దియా అధికారులు, అందులో నుంచి లైబ్రరీలకు చెల్లించేందుకు ఇష్టపడడం లేదు. మెయింటెనెన్స్ పేరుతో కొంత చెల్లించి సరిపెడుతున్నారు. వాస్తవానికి ప్రాపర్టీ దారులు కట్టే ట్యాక్స్​లో 8 శాతం లైబ్రరీలకు వెళ్లాలి. పదేండ్లుగా ఆ మొత్తం అందడం లేదు. లైబ్రరీలు కరెంట్​బిల్లులు చెల్లించలేకపోవడంతో 2014లో అధికారులు సప్లయ్​కట్​చేశారు. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ కింద నెలకు రూ.15లక్షలు రిలీజ్​చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఆ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచింది. వీటితోపాటు కొన్ని భవనాల నిర్మాణం, రెనోవేషన్ కోసం కలిపి 2014 నుంచి ఇప్పటి వరకు రూ.52 కోట్లు  ఇచ్చింది. గడిచిన పదేండ్లలో గ్రేటర్​పరిధిలోని 82 లైబ్రరీలకు రూ.1,116 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.52కోట్లు చెల్లించి చేతులు దులుపుకుంది. రూ.1,064 కోట్ల సెస్​పెండింగ్​పెట్టింది. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని లైబ్రరీల కోసం ఎందుకు ఖర్చు పెట్టరని జనం ప్రశ్నిస్తున్నారు. లైబ్రరీలలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై పుస్తక ప్రియులు మండిపడుతున్నారు. 

వరుసగా జాబ్​ నోటిఫికేషన్స్

బీఆర్ఎస్​హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పెద్దగా జరగలేదు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం సిటీ లైబ్రరీతోపాటు ఇతర లైబ్రరీల్లో నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నెలలో డీఎస్సీ, వచ్చేనెలలో గ్రూప్–2, అక్టోబరులో గ్రూప్– 1 మెయిన్స్, నవంబర్ లో గ్రూప్–3 ఎగ్జామ్స్​ఉన్నాయి. దీంతో యువత ఎక్కువగా లైబ్రరీల్లో చదువుకుంటున్నారు. తమకు కావాల్సిన బుక్స్​అందుబాటులో ఉంచితే ప్రిపేర్ అయ్యేందుకు ఈజీగా ఉంటుందని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం  నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం తమకు అండగా ఉంటుదని నమ్ముతున్నామని చెబుతున్నారు. లైబ్రరీలకు జీహెచ్ఎంసీ నిధులు కేటాయించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

లైబ్రరీల సంఖ్య పెంచాలి

అశోక్ నగర్ లోని సిటీ లైబ్రరీతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 82 లైబ్రరీలు ఉన్నాయి. 69 సొంత భవనాల్లో నడుస్తుండగా, 5 అద్దె భవనాల్లో  కొనసాగుతున్నాయి. 4 జీహెచ్ఎంసీ భవనాల్లో ఫ్రీగా కొనసాగుతున్నాయి. 33 భవనాలకు సంబంధించి రెనోవేషన్ జరుగుతోంది.14 లైబ్రరీల కోసం కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. గతంలో సిటీలో 90 లైబ్రరీలు ఉండగా, బిల్డింగ్స్, స్టాఫ్ కొరత కారణంగా ఎసీ గార్డ్స్, చంచల్ గూడ, హిమాయత్ నగర్, మురద్ నగర్, వాల్మీకి నగర్​బ్రాంచ్​లైబ్రరీలతో కలిపి మొత్తం 8 లైబ్రరీలను కరోనాకు ముందు క్లోజ్​చేశారు. అవకాశం ఉంటే వీటిని తిరిగి ప్రారంభించాలని, కొత్తవి ప్రారంభించాలని పుస్తక ప్రియులు, నిరుద్యోగులు కోరుతున్నారు.