స్వయం కృషితో చరిత్రలో తన పేరు రాసుకున్న ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవిత చరిత్రను, చరిత్రను వేరు చేసి చూడడం దాదాపుగా అసాధ్యం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి రాజకీయ నాయకుడిగానే కాకుండా, రాజనీతిజ్ఞుడిగా కూడా కొండా లక్ష్మణ్ పేరు సంపాదించారు. ఊహ తెలిసిన నాటి నుంచి ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ధీశాలి ఆయన. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు ఏ ఒక్క పదవిని చేపట్టనని నిర్ణయం తీసుకుని మాటపై నిలబడ్డ మహానీయుడు కొండా లక్ష్మణ్. పేదలపై పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాదు, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్రోద్యమం, సహకార ఉద్యమం, చేనేత ఉద్యమం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
స్వాతంత్ర్యం, న్యాయం, సమానత్వం కోసం అలుపెరుగని సామాజిక, రాజకీయ పోరాటం చేసిన బాపూజీ విలక్షణ వ్యక్తిత్వం కలిగిన బహుముఖ భాషావేత్త. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఎం.ఎస్ రాయ్ ఆలోచనలు, రచనలకు, ప్రసంగాలకు ప్రభావితుడైన బాపూజీ.. ఆయన ప్రసంగాలను ‘భారత విప్లవ సమస్యలు’ అనే పేరుతో ఉర్దూలోకి అనువదించి ముద్రించారు. రాజకీయాలు, ప్రజా జీవితంలో ఉన్నవారు నిష్కపటంగా, నిజాయితీగా ఉండాలని బోధించారు బాపూజీ. పరస్పర విరుద్ధమైన సుభాశ్ చంద్రబోస్ అతివాద ధోరణి, గాంధీజీ స్వామ్యవాద ఆలోచన ధోరణి బాపూజీపై తీవ్ర ప్రభావం చూపాయి. పల్లెలు, పట్టణాల్లోని మురికి వాడల్లో ఉండే పేదలు కుటీర పరిశ్రమల్లో, వంశపారంపర్యంగా వృత్తులు చేసుకుని బతికే వారి జీవితాలను మార్చాలని అనుక్షణం తపించేవారు. వడ్రంగి, కంసాలి, కంచర, మేదర, బెస్త, కల్లుగీత కార్మికుల, దర్జీల, వడ్డెరుల లాంటి కులాల అభ్యున్నతికి విశేష కృషి చేశారు.
మూడు తరాల ఉద్యమానికి సాక్షి
మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచారు బాపూజీ. నిజాం దొరల, దేశ్‌ముఖ్‌ల నియంతృత్వ వ్యతిరేక పోరాటంలో కీలకంగా ఉంటూనే దేశ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారు. నిజాం రాజ్యంలో అట్టడుగు నుండి మహోన్నతంగా ఎదిగిన జాతీయ నాయకుడు బాపూజీ. తన కుటుంబ జీవితాన్ని, ఆస్తులను, పదవులను, రాజకీయ అధికారాన్ని కూడా త్యాగం చేసి స్వాభిమానం కోసం ఎవరికీ తలవంచకుండా జీవించారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
1952లో ఎమ్మెల్యేగా తొలిసారి
తెలంగాణ ఇండియాలో కలిసిన తర్వాత కొండా లక్ష్మణ్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి 1952లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా విశేష సేవలు అందించడమే కాకుండా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోని నాయకులను సైతం ఎదిరించి బహుజన, శ్రామిక వర్గాల పక్షాన నిలబడిన పక్షపాతి ఆయన. 1969 లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచారు. బీసీలకు మేలు చేసే బీపీ మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని సమిష్టి నాయకత్వంతో మాత్రమే రాష్ట్ర సాధన సాధ్యమని చాటారు. విద్యార్థి, యువజనులను చైతన్యం చేసి తన 96 ఏండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో సామాజికతను జోడించారు బాపూజీ.
గాంధీజీని కలవడంపై ఆంక్షలున్నా..
ఉర్దూ, మరాఠీ భాషల్లో పాఠశాల విద్యను కొనసాగించిన కొండా లక్ష్మణ్.. గాంధీని ఎవరు కలవకూడదని ఆంక్షలు ఉన్నప్పటికీ స్వతంత్ర్య ఉద్యమం పట్ల ఆకర్షితుడై తన పదహారేండ్ల వయసులో కొంతమంది విద్యార్థులతో చంద్రాపూర్‌లో గాంధీని కలిశారు. హైదరాబాద్ సిటీ కళాశాలలో హైస్కూల్ విద్యను అభ్యసించారు. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. యువకులు పాల్గొంటేనే ఉద్యమం సాగుతుందని 20 ఏండ్ల వయస్సులోనే జాతీయ ఉద్యమంలో యువకులు పాల్గొనేలా రహస్య శిక్షణ ఇచ్చేవారు. 1938 లో నిజాం పాలనలో పౌర హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహం, హిందూ మహాసభ, ఆర్య సమాజం చేసిన పోరాటంలో పాల్గొని కొండా మరోసారి అరెస్ట్ అయ్యారు.
ఆర్థిక ఇబ్బందులతో..
పదో తరగతి పాసైన కొండా ఆర్థిక ఇబ్బందుల వల్ల కాలేజీ విద్య మానేసి సాయంత్ర వేళ హైకోర్టు నడిపే లా కోర్సులో చేరి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఆనాటి ఉద్యమకారులైన చాకలి ఐలమ్మ, బందగి లాంటి వాళ్లకు న్యాయ సహాయం అందించారు. డెహ్రాడూన్‌లో 1940 లో నిర్వహించిన రాజకీయ శిక్షణకు హాజరై రివల్యూషనరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియా అనే అంశంపై ఎం.ఎన్.రాయ్ చేసిన ఉపన్యాసంతో ప్రభావితుడయ్యారు లక్ష్మణ్. స్వాతంత్ర్య పోరాట సమయంలో షోలాపూర్‌లో సుభాశ్ చంద్రబోస్‌ను కలిసి నిజాం నిరంకుశత్వంపై చర్చించారు. 1941 లో పోలీసులు కొండా ఇంటిని ముట్టడించారు. వారి నుంచి తప్పించుకొని కొంతకాలం అజ్ఞాతంలో ఉండి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించారు.
పౌర రక్షణ కమిటీల ఏర్పాటు
బాపూజీ 1941 లో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కిసాన్ సదస్సు ఏర్పాటు చేసి జాతీయ నాయకులు జయప్రకాశ్ నారాయణ, ఎన్జీ రంగా వంటి వారిని ఆహ్వానించారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటీష్ రెజిమెంట్ ప్రాంగణం, టెలిగ్రాఫ్ కార్యాలయంతో పాటు పలు చోట్ల కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేశారు. సామాన్యులను రక్షించడం కోసం హైదరాబాద్‌లోని అనేక ప్రాంతంల్లో పౌర రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. 1942 లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ సమయంలో రావి నారాయణ రెడ్డి, బద్ద ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. 1943 లో ఏర్పాటు చేసిన చేనేత సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా నిజాం రాష్ట్ర పద్మశాలి మహాసభలను కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చేనేత రంగం దెబ్బతినడంతో బాపూజీ పెద్ద ఉద్యమం చేసి నిజాం ప్రభుత్వంలో యార్న్ కూపన్ పద్ధతి తీసుకొచ్చారు. 1945 లో నిజాం రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సేవల వలనే ఆచార్య బిరుదు
ఆయన సేవలకు ఆచార్య బిరుదు వచ్చింది. సహకార రత్నగా కూడా పేరుగాంచారు. 2005 ఆగస్టు 9 న భారత రాష్ట్రపతి ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్ అవార్డు ఇచ్చారు. 2007లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా నియమించబడ్డారు. 2010 లో ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో బాపూజీ సేవా సదన్ ప్రారంభించి గిరిజనులకు సేవ చేయడానికి రూ.25 లక్షల విరాళంగా ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం కోసం, వారి సంక్షేమం కోసం బీసీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. దానికి 25 లక్షల ఫండ్ ఇచ్చారు. రహస్య జీవితం గడుపుతున్న సమయంలోనే మద్రాస్‌లో 1948 జూన్ 27న డాక్టర్ శకుంతలాదేవితో బాపూజీకి వివాహం జరిగింది.బాపూజీ ఇద్దరి కుమారులలో ఒకరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరి మరణించారు.
2012 సెప్టెంబరు 21న తుదిశ్వాస
నిజాం రాజ్యం ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ తాలూకాలోని మారుమూల గ్రామం వాంకిడి (ప్రస్తుత తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా)లో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27 న జన్మించిన బాపూజీ 97 సంవత్సరాలు జీవించి 2012, సెప్టెంబర్ 21న తుదిశ్వాస విడిచారు.
ఫ్రీగా కేసులు వాదించేవారు
రాజకీయ కేసుల్లో మధ్యవర్తులను పక్కన పెట్టిన అతికొద్ది మంది న్యాయవాదుల్లో కొండా ఒకరు. కక్షిదారుల నుంచి డబ్బులు తీసుకునేవారు కాదు. అనేక మంది రాజకీయ కేసులు వాదించి సర్కార్ కోపానికి గురయ్యేవారు. అంతేకాకుండా కొన్నిసార్లు జడ్జీలకు కూడా శతృవయ్యారు. భూస్వాములు, నిరంకుశ శక్తులతో కూడిన నిజాం సర్కార్ ప్రగతిశీల చట్టాలకు ఎప్పుడూ మోకాలడ్డుతూనే ఉండేది. సంఘ సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోసం బాపూజీ జంట నగరాల్లో అనేక నిరసనలు చేపట్టారు. పద్మశాలి హాస్టల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1949 లో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. 1944 నుంచి 1960 వరకు రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడిగా, 1951 నుండి 1956 వరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంఘానికి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన కొండా.. నిరంతర కృషితోనే హైదరాబాద్ రాష్ట్రం చేనేత వృత్తి నిర్వహించే 15 కులాలకు విద్యా సదుపాయాలు కల్పించేందుకు వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది.
నిజాం నవాబుపై బాంబు దాడి
నిజాం రాష్టాన్ని ఇండియన్ యూనియన్‌లో కలపడానికి జరిగిన ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషించారని 1947లో నిజాం పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కొంతకాలం రహస్య జీవితంలోకి వెళ్లి రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లపైన బాంబులు వేశారు. అంతేకాకుండా 1947 డిసెంబర్ 4న నిజాం నవాబుపై కూడా బాంబు దాడి చేసిన బృందంలో కొండా సభ్యునిగా ఉన్నారు. బాంబు దాడిలో పాల్గొన్న పవార్‌ను అరెస్ట్ చేసిన నిజాం పోలీసులు కొండా లక్ష్మణ్‌ను కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. దీంతో ఆయన బొంబాయి వెళ్లారు. ఇదే కేసులో ఆయన స్నేహితులు చాలామందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తెలంగాణను ఇండియాలో కలిపిన తర్వాత కొండా లక్ష్మణ్‌పై ఉన్న కేసులన్నీ ఎత్తివేశారు.
సాయిని నరేందర్, సామాజిక విశ్లేషకులు