కొత్త టీచర్లు వస్తున్నరు .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1075 మంది ఎంపిక

కొత్త టీచర్లు వస్తున్నరు .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1075 మంది ఎంపిక
  • పాఠశాలల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత 
  • సర్కార్ బడుల్లో మెరుగుపడనున్న విద్యాబోధన 
  • సీఏం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న టీచర్లు
  • అభ్యర్థులు లేక మిగిలిపోయిన 220 పోస్టులు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలో వేధిస్తున్న టీచర్ల కొరత తీరనుంది. తాజాగా నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు త్వరలోనే ఆయా పాఠశాల్లో డ్యూటీలో చేరనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024 డీఎస్సీలో 1,295 టీచర్ పోస్టులకు పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా 1:3 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి ఎంపిక చేశారు.

బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో డీఈవోలతో కలిసి హైదరాబాద్​కు వెళ్లిన కొత్త టీచర్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. అయితే, 1,295 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. మెరుగైన ర్యాంకులు సాధించిన 1,075 మంది మాత్రమే ఎంపికయ్యారు. రోస్టర్ పాయింట్లు, పలు కేటగిరీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో నిర్మల్ జిల్లాలో 64, ఆదిలాబాద్ 58, మంచిర్యాలలో 40, ఆసిఫాబాద్ లో 58 మొత్తం 220 పోస్టులు మిగిలిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పోస్టుల్లో 41లకు గానూ కేవలం 4 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 

పదేండ్ల తర్వాత..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 డీఎస్సీ తర్వాత మళ్లీ పోస్టుల భర్తీ జరగలేదు. పదేండ్ల కాలంలో కేవలం ఒకేఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉపాధ్యాయ పోస్టుల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అటు డీఎస్సీ అభ్యర్థులు సైతం లక్షల్లో పెరిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల్లోనే మెగా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేయడంతో ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్తుల కల నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దసరా సెలవుల తర్వాత ఈ కొత్త టీచర్లంతా విధుల్లో చేరనున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్జీటీ పోస్టులు భర్తీ కానుండటంతో ఏకోపాధ్యాయ స్కూళ్లలో టీచర్ల కొరత తీరనుంది. ఇన్నేండ్లుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాబోధన కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు 
రూ.కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. 

బదిలీ టీచర్లకు ఎట్టకేలకు మోక్షం

చాలా ఏండ్ల తర్వాత ఉపాధ్యాయులకు గత జూన్ లో బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ విధానంలో చేపట్టింది. అనుకున్నట్లుగానే నిర్దేశించిన షెడ్యుల్ ప్రకారం బదిలీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త పోస్టింగ్ లకు సంబంధించిన ఆర్డర్లు కూడా జారీ చేసింది. బదిలీ అయిన టీచర్లకు రిలీవర్ వచ్చిన తర్వాతనే వారిని ఆ స్కూల్ నుంచి బదిలీ చేయాలని నిబంధనలు కూడా విధించింది.

దీంతో మారుమూల ప్రాంతాల్లోని చాలా స్కూళ్లకు, అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను కౌన్సిలింగ్​లో టీచర్లు ఎంపిక చేసుకోలేదు. దీంతో బదిలీ అయిన టీచర్లు రిలీవ్​కు నోచుకోలేదు. రిలీవింగ్, జైనింగ్ ఆర్డర్లు జారీ చేసే ముందుగా రిలీవర్ ఉంటేనే జైనింగ్ ఆర్డర్ ఇస్తామంటూ స్పష్టం చేయడంతో.. తాము బదిలీ అయినప్పటికీ తమ స్థానంలోకి వెళ్లలేకపోయమనే నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా నియామకైన కొత్త టీచర్లతో వారి రిలీవ్​కు మోక్షం కలగనుంది.