108 సిబ్బందికి మూడు నెలలుగా జీతమిస్తలే...

వరంగల్‍, వెలుగు: నిరంతరం ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి సీనియారిటీ ప్రకారం శాలరీలు పెంచుతామన్న ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చే జీతాలే ఇవ్వడం లేదు. మూడు నెలలుగా శాలరీలు అందకపోవడంలో వందలాది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే తక్కువ జీతాలకు పనిచేస్తున్న తమకు ఇప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చే జీతాలే ఇవ్వకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అమలుకాని జీతాల పెంపు హామీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మంది 108లో పనిచేస్తున్నారు. మొదటి నుంచి జీవీకే ఈఎంఆర్‌ఐ తరఫున సేవలు అందిస్తున్న వీరిని సంస్థ ఇటీవల ‘ఈఎంఆర్‌ఐ గ్రీన్‍ హెల్త్‌ సర్వీసెస్‌’లోకి మార్చారు. కొత్త టెండర్‌ ప్రక్రియ సైతం పూర్తైంది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 70 నుంచి 80 శాతం సిబ్బంది ఇప్పటికే 12 ఏండ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ మెడికల్‍ టెక్నిషియన్‌ గ్రేడ్‌ 1 సిబ్బందికి రూ.21,734, సీనియర్‍ పైలట్‌కు రూ.21,207 చెల్లిస్తున్నారు. అయితే సీనియారిటీ ప్రకారం తమకు జీతాలు పెంచాలని సిబ్బంది చాలా రోజుల నుంచి కోరుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇదే పనిచేస్తున్న సిబ్బంది రూ. 35 వేలకు పైగా చెల్లిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం తక్కువ జీతాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీంతో సీనియర్‌ ఈఎంటీలకు రూ.30 వేలు, సీనియర్‍ పైలట్లకు రూ.28వేలు ఇస్తామని 8 నెలల క్రితం ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు.

మూడు నెలలుగా అందని జీతాలు

108లో పనిచేసే వారిలో ఎక్కువ మంది సొంత గ్రామాల నుంచి సిటీ, పట్టణాలకు వచ్చి ఉంటున్నారు. జీతాలు పెంపు మాట అటుంచితే ప్రస్తుతం 108 సిబ్బందికి రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ జీతాలే ఇప్పటివరకు ఇవ్వలేదు. అసలే తక్కువ జీతాలతో పనిచేస్తున్న తమకు ప్రసుత్తం రెగ్యులర్‌గా ఇచ్చే శాలరీలు కూడా ఇవ్వకపోవడంతో ఇంటి కిరాయిలు, పిల్లల స్కూల్‌ ఫీజులు ఎలా కట్టాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తమకు జీతాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని ఆఫీసర్లు, మంత్రుల చుట్టూ తిరిగినా రేపు మాపంటూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.