108 అడుగుల ఆదిశంకరాచార్య  విగ్రహావిష్కరణ

108 అడుగుల ఆదిశంకరాచార్య  విగ్రహావిష్కరణ
  • స్టాచ్యూను ఆవిష్కరించిన మధ్యప్రదేశ్ సీఎం 

ఓంకారేశ్వర్ : మధ్యప్రదేశ్​లోని ఓంకారేశ్వర్ లో 108 అడుగుల (32 మీటర్లు) ఆదిశంకరాచార్య విగ్రహాన్ని గురువారం ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్ ఆవిష్కరించారు.  ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్‌‌ లో నర్మదా నది ఒడ్డున మాంధాత పర్వతంపై దీనిని ఏర్పాటు చేశారు. అనేక లోహాల సమ్మేళనంతో తయారు చేసిన ఈ విగ్రహం 54 అడుగుల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి “స్టాచ్యూ ఆఫ్ వన్ నెస్ (ఏకాత్మతా ప్రతిమ)” అని పేరు పెట్టారు.

విగ్రహ ప్రతిష్టాపనలో 5 వేల మంది సాధువులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 18న నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారానికి వాయిదా పడింది. విగ్రహంతో పాటు, మ్యూజియం నిర్మాణానికి రూ. 2,141.85 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 15.6 హెక్టార్లలో అద్వైత్ లోక్‌‌ పేరుతో మ్యూజియం  నిర్మించనున్నారు.

ఏకాత్మతా ప్రతిమను తీవ్రమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. ఇది దాదాపుగా 500 ఏండ్ల వరకూ చెక్కుచెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.