- రూ.3కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణ
- 2016 నుంచి అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఆఫీసర్లు
రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో కరెంట్ పోళ్ల మాయంపై నేటికీ లెక్క తేలట్లేదు. 2016 నుంచి సుమారు 10,800 స్తంభాలు మాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రూ.3కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. సెస్‌లో అవినీతిపై పాలకవర్గం దృష్టి సారించి విచారణకు ఆదేశించింది.
ఒక్కో పోల్‌ను రూ.3వేలకు అమ్ముకున్నరు
సెస్ పరిధిలో 13 మండలాలు, 255 జీపీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో రైతుల పొలాల కోసం, లూజ్ లైన్ల రిపేర్లు కోసం కరెంట్ పోల్స్ వేశారు. అయితే కరెంట్ పోల్స్ విషయంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. గత పాలకవర్గంలోని రెండు, మూడు మండలాల్లో కొందరు డైరెక్టర్లు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై గతేడాది ఏర్పడిన పాలకవర్గం ఆరాతీయగా ఎల్లారెడ్డిపేట మండలంలో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు. దీంతోపాటు రుద్రంగి, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లోనూ అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 2016 నుంచి వేసిన 10,800 పోల్స్ ఎక్కడున్నాయనేది ఇప్పటికీ తేలడం లేదు.
ఒక్కో కరెంట్ పోల్‌ను రైతులకు రూ.3వేలకు అమ్మినట్లు ఆరోపణలున్నాయి. ఈలెక్కన రూ.3కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ బాగోతంలో సెస్ సిబ్బంది, లూజ్ లైన్ల రిపేర్లు చేపట్టిన కాంట్రాక్టర్ కుమ్మక్కయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిలో డైరెక్టర్లతోపాటు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పాలకవర్గం విచారణకు ఇద్దరు డీఈలను నియమించింది. అయితే మూడు నెలల కింద ఓ డీఈ ట్రాన్స్‌ఫర్ కాగా ఎంక్వైరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. త్వరలో మరో ఆఫీసర్‌ను నియమించి తొందర్లోనే ఎంక్వైరీ పూర్తిచేస్తామని పాలకవర్గ పెద్దలు చెబుతున్నారు.
అవినీతి చేసిన వారిని వదలం
ఎల్లారెడ్డిపేట, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో అవినీతి జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. రైతులకు కరెంట్ పోల్స్ అమ్ముకున్నట్లు తెలిసింది. దీనిపై ఇద్దరు అధికారులతో విచారణకు ఆదేశించాం. కానీ ఇటీవల ఓ డీఈ ట్రాన్స్ ఫర్ కాగా ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తాం. విచారణలో తేలితే ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
సెస్ చైర్మన్, చిక్కాల రామారావు