గురుకులంలో టెన్త్‌ స్టూడెంట్‌ సూసైడ్‌

గురుకులంలో టెన్త్‌ స్టూడెంట్‌ సూసైడ్‌
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా బాలానగర్‌లో ఘటన

బాలానగర్, వెలుగు : గురుకులంలో ఉంటున్న ఓ టెన్త్‌ స్టూడెంట్‌ హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బాలానగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలో చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేశ్, రజిత దంపతుల కూతురు ఆరాధ్య (16) ఐదేండ్లుగా బాలానగర్‌లోని బాలికల గురుకులంలో ఉంటోంది. ప్రస్తుతం ఆ బాలిక టెన్త్‌ చదువుతోంది. 

గురువారం తెల్లవారుజామున 5.30 గంటల టైంలో స్టూడెంట్లు నిద్ర లేచి చూడగా ఆరాధ్య ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకొని వివరాలు సేకరించిన అనంతరం ఆరాధ్య డెడ్‌బాడీని షాద్‌నగర్‌ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ ఎస్సై లెనిన్‌ చెప్పారు. కాగా స్టూడెంట్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. 

స్టూడెంట్‌ సూసైడ్‌కు కారణాలు తెలుసుకోవాలని, ఆమె ఫ్యామిలీకి పరిహారం అందించాలంటూ ఏబీవీబీ నాయకులు గురుకులం వద్ద ధర్నాకు దిగారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుథ్‌రెడ్డి బాలిక కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు. సాయంత్రం కలెక్టర్‌ విజయేందిర బోయి గురుకులాన్ని పరిశీలించి, బాలిక ఆత్మహత్యకు గల విషయాలపై ఆరా తీశారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.