
- మ్యాథ్స్ క్వశ్చన్లను వైట్ పేపర్‌పై రాయించి బయటకు తెప్పించిన తండ్రి
- ఇద్దరు మైనర్లతో పాటు మరో ఎనిమిది మందిపై కేసు
- జువైనల్ హోమ్‌కు మైనర్లు, ఆరుగురు వ్యక్తులు అరెస్ట్
కామారెడ్డి, వెలుగు : తన కొడుకును టెన్త్‌లో పాస్ చేయించేందుకు వైట్ పేపర్‌పై క్వశ్చన్లను రాయించి బయటకు తెప్పించాడో తండ్రి. ఈ క్వశ్చన్లను కొందరు వ్యక్తులు ఫొటో తీసి వాట్సప్‌లో సర్క్యులేట్ చేశారు. టెన్త్ మ్యాథ్స్ ఎగ్జామ్ సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు. కంటాలి తండాకు చెందిన ఓ స్టూడెంట్ టెన్త్ చదువుతున్నాడు. ఇతడు జుక్కల్ జడ్పీ హైస్కూల్‌లో బుధవారం మ్యాథ్స్ఎగ్జామ్కు హాజరయ్యాడు. సెంటర్ బయట ఉన్న ఆ స్టూడెంట్ తండ్రి జాదవ్ సంజయ్ తన కొడుకుకు ఆన్సర్లను అందించాలని ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా ఎగ్జామ్ సెంటర్‌లో వాటర్ సప్లై చేసేందుకు నియమించిన సయ్యద్ ముబీన్‌కు ఓ వైట్ పేపర్ ఇచ్చి తన కొడుకుకు ఇవ్వాలని చెప్పాడు. ముబీన్ సెంటర్ లోపలికి వెళ్లి స్టూడెంట్‌కు వైట్ పేపర్ ఇవ్వడంతో.. అతడు ఐదు ప్రశ్నలను కాగితంపై రాసి ముబీన్‌కు ఇచ్చాడు. అతడు బయటకు వచ్చి క్వశ్చన్లు రాసిన పేపర్‌ను సంజయ్‌కి అందించాడు. అతడు ఆ క్వశ్చన్లను కంబాడే మనోజ్, వరప్రసాద్ అనే వ్యక్తులకు చూపించాడు.
ప్రశ్నలను మనోజ్ ఫొటో తీసి మెహురి హన్మండ్లుకు పంపగా అతడు భాను అనే వ్యక్తికి, అతడు బీర్కూర్‌లో ఉండే కొప్పుల గంగాధర్‌కు పంపించాడు. క్వశ్చన్ల లీకేజీకి సంబంధించి గంగాధర్ ఓ వీడియోను తయారు చేసి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. విషయాన్ని గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యాశాఖ ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగారు. క్వశ్చన్లను బయటకు తీసుకొచ్చిన వారితో పాటు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశారు.
ఇందులో జాదవ్ సంజయ్, సయ్యద్ ముబీన్, మనోజ్, వరప్రసాద్, మెహురి హన్మండ్లు, కొప్పుల గంగాధర్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు పంపించారు. వాట్సప్‌లో ఫార్వార్డ్ చేయడంతో పాటు, గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న రిపోర్టర్లు భాను, నహీమ్‌ఖాన్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. జుక్కల్ సెంటర్ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంపైనా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.