పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో గురువారం 10వ రాష్ట్రస్థాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
గురుకులాల రాష్ట్ర కార్యదర్శి సక్రు నాయక్ మాట్లాడుతూ తెలంగాణలోని గురుకులాల్లో క్రీడా పోటీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. క్రీడా పతాకాలను వీరితో కలిసి జోనల్ అధికారి కొప్పుల స్వరూపారాణి ఆవిష్కరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మీట్ ఓవర్ ఆల్ ఇన్చార్జ్ సట్ల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి శ్రీనివాస్, టెక్నికల్ మేనేజర్ కే వాసు, పాల్వంచ తహసీల్దార్ జి.వివేక్, ఎంపీడీవో బి.నారాయణ, మల్టీ జోన ల్ ఆఫీసర్ కాంపాటి అలివేలు, మూడవ జోన్ జోనల్ ఆఫీసర్ కె.ప్రత్యూష, పాల్వంచ గురుకుల ప్రిన్సిపాల్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.