- మెదక్ లో ప్రారంభమైన జోనల్ లెవల్ పోటీలు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్లో సోమవారం 10వ రాష్ట్రస్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. డీఎస్పీ ప్రసన్న కుమార్, కో ఆర్డినేటర్సువర్ణలత జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించారు. నేషనల్, ఒలంపిక్స్, సొసైటీ జెండాలను సీఐ నాగరాజు, తహసీల్దార్ లక్మణ్ బాబు ఎగురవేశారు. జోన్ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన 13 గురుకుల స్కూళ్ల క్రీడాకారులు 1,105 మంది హాజరయ్యారు.
ఇక్కడి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్చదువుతోపాటు క్రీడా రంగంలోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు.
జిల్లా కో ఆర్డినేటర్, మెదక్ గురుకుల స్కూల్ప్రిన్సిపాల్ సువర్ణ లత మాట్లాడుతూ నిరంతర సాధనతోనే స్టూడెంట్స్అన్ని రంగాల్లో రాణించవచ్చని సూచించారు. కార్యక్రమంలో, రామక్కపేట్, చిన్నబోనాల, బద్దెనపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, చొప్పదండి, హుజూరాబాద్, నిర్మల, వర్గల్, గజ్వేల్, కొల్చారం, తూప్రాన్, రామాయంపేట రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థులు, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.