ఎమ్మెల్సీ బరిలో మెదక్​ నేతలే టాప్

ఎమ్మెల్సీ బరిలో మెదక్​ నేతలే టాప్
  • ఎమ్మెల్సీ బరిలో గ్రాడ్యుయేట్ స్థానంలో 11 మంది, టీచర్స్ స్థానంలో ఐదుగురు పోటీ

మెదక్, వెలుగు: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థులు ఎంతమంది అనేది తేలిపోయింది. నామినేషన్ల విత్ డ్రా అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధి ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తరించి ఉండగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఉమ్మడి మెదక్ ​జిల్లావారే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. పోటీదారుల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు, ప్రధాన టీచర్స్ యూనియన్ అభ్యర్థులు ఇక్కడి వారే ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ జిల్లా కీలక పాత్ర పోషించనుంది. 

గ్రాడ్యుయేట్ స్థానంలో..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 56 మంది బరిలో ఉండగా వారిలో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపూర్ కు చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సదాశివపేటకు చెందిన  దొడ్ల వెంకటేశం తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థిగా, ఇంద్రకరణ్ కు చెందిన చంద్రశేఖర్ ఆలిండియా కిసాన్ జనతా పార్టీ అభ్యర్థిగా, సిద్దిపేటకు చెందిన మంద జ్యోతి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా, పాములపర్తికి చెందిన సిల్వర్ ఇంద్ర గౌడ్ నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

వీరే కాకుండా సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన అశోక్ గౌడ్, సిద్దిపేట టౌన్ కు చెందిన దేవునూరు రవీందర్, దుబ్బాక కు చెందిన మచ్చ శ్రీనివాస్, పెద్ద లింగారెడ్డి పేటకు చెందిన గుమ్మడి శ్రీశైలం, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన కే.శంకర్ రావ్, చిగురుపల్లికి చెందిన చిట్కుల్ నరేందర్ రెడ్డి ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉండడంతో ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారు, ఎవరి ఓట్లకు గండి కొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. 

టీచర్స్ స్థానంలో..

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది బరిలో నిలవగా  వారిలో ఐదుగురు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డి సిద్దిపేట పట్టణానికి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సిద్దిపేట జిల్లా గోనేపల్లికి, మరో అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి సిద్దిపేట పట్టణానికి చెందిన వారు కాగా, టీపీటీఎఫ్ మద్దతుతో పోటీలో ఉన్న వై. అశోక్ కుమార్ సంగారెడ్డి జిల్లా మల్లాపూర్ కు చెందిన వారు. మరో అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి మెదక్ జిల్లా టేక్మాల్ కు చెందిన వారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఎక్కువ మంది ఉమ్మడి మెదక్ జిల్లా కు చెందిన వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.