కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో 11 పశువులు మృతి

మరిపెడ, వెలుగు: ఈదురుగాలుల కారణంగా తెగి పడిన విద్యుత్‌‌‌‌ వైర్లు తగిలి కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ 11 మూగజీవాలు చనిపోయాయి. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా చిన్న గూడూరు మండలంలోని మంగోలిగూడెం, మేగ్యా తండాలో శుక్రవారం జరిగింది. మంగోలిగూడెం గ్రామానికి చెందిన రైతులు లునావత్‌‌‌‌ రామోజీ, రమేశ్‌‌‌‌, బాలాజీ, నరేశ్‌‌‌‌, బానోతు నరేశ్‌‌‌‌, మచ్చ రాములుకు చెందిన ఏడు ఎడ్లు, ఓ ఆవు, మేగ్యాతండాకు చెందిన బానోత్‌‌‌‌ సిరి, లకావత్‌‌‌‌ బాలు, లకావత్ సురేశ్‌‌‌‌కు చెందిన మూడు ఎడ్లను శుక్రవారం మేతకు తీసుకెళ్లారు. గురువారం గాలివాన బీభత్సం కారణంగా విద్యుత్‌‌‌‌ వైర్లు తెగి పొలాల్లో పడ్డాయి. మేత కోసం తిరుగుతున్న మూగజీవాలు విద్యుత్‌‌‌‌ వైర్లను తగలడంతో కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టి అక్కడికక్కడే చనిపోయాయి. మేగ్యాతండాకు చెందిన ఓ వ్యక్తి గమనించి సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేయడంతో విద్యుత్‌‌‌‌ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న వెటర్నరీ డాక్టర్‌‌‌‌ లక్ష్మి ఘటనాస్థలానికి చేరుకొని మూగజీవాలకు పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించారు. చనిపోయిన పశువుల విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.