
హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో సంస్కరణలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ఏండ్లకేండ్లుగా పాతుకుపోయిన ఐఏఎస్‌లను బదిలీ చేస్తున్నది. గత ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని, ఇన్నాళ్లు లూప్ లైన్ లో ఉన్న అధికారులకు ముఖ్యమైన డిపార్ట్ మెంట్లు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కొంతమంది ఐఏఎస్ లను బదిలీ చేసిన సర్కార్.. ఇప్పుడు తాజాగా మరో 11 మందిని ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న అరవింద్ కుమార్ పై బదిలీ వేటు వేశారు. ఈయన కొన్నేండ్లుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్ గా (అదనపు), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.
2018లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టగా, అప్పటి నుంచి ఈ మూడు బాధ్యతలను అరవింద్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడాయనను తప్పించిన ప్రభుత్వం.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్‌గా నియమించింది. ఈ ఒక్క శాఖకు మాత్రమే అరవింద్ కుమార్‌ను పరిమితం చేసింది. ఆయన స్థానంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా దాన కిశోర్‌ను నియమించింది. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
అధికారుల బదిలీలు ఇలా..
- మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ను డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ సీఎస్ గా బదిలీ చేశారు.
- బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
- రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాణిప్రసాద్‌ను అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేశారు.
- జలమండలి ఎండీగా ఉన్న దాన కిషోర్‌ను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్న కేఎస్ శ్రీనివాసరాజును రవాణా శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.
- సీఎంఓ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను జీఏడీ సెక్రటరీగా నియమించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న క్రిస్టినా జడ్ చొంగ్తును వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.
- మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న సుదర్శన్ రెడ్డిని జలమండలి ఎండీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
- ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీదేవిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించారు.
- వాకాటి కరుణను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించారు.
- నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గానియమించారు.
అరవింద్‌పై ఆరోపణలు?
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లీజుతో పాటు సిటీ శివారు ప్రాంలతాల్లో హెచ్ఎండీఏ భూముల అమ్మకాల విషయంలో అరవింద్ కుమార్ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓఆర్ఆర్ లీజు వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించినా, ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరినా అరవింద్ కుమార్ ఆఫీస్ (హెచ్ఎండీఏ ఎండీ) నుంచి ఆశించిన స్థాయిలో రిప్లై రాలేదు. చివరకు రేవంత్ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో రేవంత్‌కు హెచ్ఎండీఏ నోటీసులు పంపింది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని ఐఏఎస్‌లలో కొంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైన డిపార్ట్ మెంట్లు అప్పగించింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించింది. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను నియమించింది. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. కాగా, సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారు.