చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని ఫీల్డ్ సెట్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ వికెట్లు తీసే క్రమంలో ఫీల్డర్లందరినీ 30 గజాల లోపు ఉంచాడు. సింగిల్ ఫ్రేమ్ లో మొత్తం 11 మంది భారత ప్లేయర్లు కనిపించడం విశేషం. సాధారణంగా టెస్టుల్లో ఇలాంటి ఫీల్డింగ్ సెట్ చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం.
ఈ ఫీల్డ్ సెట్ లో భాగంగా వికెట్ కీపర్ తో ముగ్గురు స్లిప్ ఫీల్డర్లు.. గల్లీ వద్ద ఒక ఫీల్డర్.. పాయింట్ వద్ద మరో ఫీల్డర్ ఉన్నారు. షార్ట్ ఫైన్ లెగ్.. షార్ట్ లెగ్.. షార్ట్ మిడ్ వికెట్.. షార్ట్ కవర్ వద్ద ఫీల్డింగ్ ను సెట్ చేశాడు. బౌలర్ తో కలిపి మొత్తం 11 మంది ఫీల్డర్లు దగ్గరే ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి బంగ్లా వద్ద సమాధానం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే పరిమితమైంది.
Also Read:-దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ రెండో ఇన్నింగ్స్ లో 46 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జైశ్వాల్ తక్కువ స్కోర్ కే ఔటైనా గిల్ (75), రిషబ్ పంత్ (55) భాగస్వామ్యంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం భారత్ 393 పరుగుల ఆధిక్యంలో ఉంది.