హైదరాబాద్; జూన్ 20 నుంచి ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో ఉన్న 11 లక్షల 77 వేల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ (డీ వార్మింగ్ టాబ్లెట్స్) ఇవ్వడం జరుగుతుందని హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలను మంత్రులు దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్ స్వయంగా వేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లలాడుతూ ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీ వార్మింగ్ డే జరుపుకుంటున్నామన్నారు.
తెలంగాణ భాషలో చెప్పాలంటే నట్టల మందు కార్యక్రమం అని అన్నారు. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఈ మందులు వేసుకోవాలన్నారు. శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టాబ్లెట్స్ వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ లో ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పారు. ఆరోగ్య శాఖను మరింత ముందుకు తీసుకుపోవడానికి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో సమీక్షా నిర్వహించారన్నారు.