- ఇంకా కొనసాగుతున్న కాల్పులు
- అడవిలో 1400 మంది జవాన్లు
- మావోయిస్టుల నుంచి ప్రతిఘటన!
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్–-మహారాష్ట్ర సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగి 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
బస్తర్ఐజీ సుందర్రాజ్.పి, నారాయణ్‌పూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్‌కుమార్ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీన ఎస్టీఎఫ్, డీఆర్జీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బెటాలియన్ కు చెందిన 1400 మందికి పైగా జవాన్లు అబూజ్మడ్ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లారు. మూడు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నారు. మంగళవారం కొహక్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘమండీ- కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఈ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
ఇరువర్గాల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సల్స్ పారిపోతూ బృందాలుగా విడిపోయి అటాక్ చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న భద్రతాబలగాలు గట్టిగా బదులు ఇచ్చాయి. 11 మంది మావోయిస్టులు చనిపోగా మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అడవిలో ఇంకా కాల్పులు జరుగుతుండటంతో అబూజ్మడ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది.
భారీగా బలగాల మోహరింపు
బలగాలు ఇంకా అడవుల్లోనే ఉండటం, మావోయిస్టుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుండడంతో భీకర పోరు నడుస్తున్నట్లుగా సమాచారం. దీంతో అబూజ్మాడ్ ప్రాంతానికి బయటి నుంచి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. అడవిలోని జవాన్లకు బ్యాకప్‌గా మోహరించేందుకు కొహక్మెట్ పోలీస్‌స్టేషన్ ప్రాంతానికి తరలిస్తున్నాయి. అయితే ఎన్కౌంటర్ గురించిన పూర్తి వివరాలు బలగాలు బయటకు వచ్చాక వెల్లడిస్తామని ఐజీ సుందర్రాజ్.పి తెలిపారు. జవాన్లు సేఫ్‌గానే ఉన్నారని, మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.