
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఎస్పీ ప్రభాత్‌కుమార్ సమక్షంలో శుక్రవారం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం కమాండర్లు సన్ను అలియాస్ మంగేశ్ ఉపేండి, సంతు అలియాస్బద్రు వద్దా, జనిలా అలియాస్ జల్కొ కొర్రం, సుక్కి మాండవి, శాంతి కోవాచి, మాసే అలియాస్ క్రాంతి వద్దా, సరిత ఉసెండి, మంగటి, దేవరాం అలియాస్ కరువద్దా, రతన్ అలియాస్ ముఖేశ్ పూనం, కాలా అలియాస్ సుఖ్మతి ఉన్నారు. వీరిపై రూ.40 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.
మందుపాతర పేలి వ్యక్తి మృతి
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ కూలీ బలి అయ్యాడు. ఛోటే డోంగ్రే పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆమ్‌దాయి మైన్స్‌లో పనిచేసేందుకు ఉదయం కూలీలు వెళ్తుండగా దిలీప్కశ్యప్, హరేంద్రనాగ్ అనే వ్యక్తులు మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేశారు. దీంతో అది పేలడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చోటేడోంగ్రే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నారాయణ్‌పూర్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే దిలీప్ కశ్యప్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్న హరేంద్రనాగ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
అమరుల స్తూపాన్ని కూల్చిన భద్రతాబలగాలు
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని పూజారి కాంకేర్ బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న తామిల్‌బట్టి అడవుల్లో మావోయిస్టులు నిర్మించిన 70 అడుగులు స్మారక స్తూపాన్ని శుక్రవారం భద్రతా బలగాలు కూల్చి వేశాయి. పూజారి కాంకేర్‌లో ఇటీవలే సీఆర్‌పీఎఫ్ బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న టైంలో స్తూపం కనిపించడంతో వెంటనే దానిని కూల్చివేశారు.