జోరుగా రేషన్​ రీసైక్లింగ్ దందా.. సన్నరకం బియ్యంగా కలరింగ్​

నిజామాబాద్, వెలుగు: జిల్లా సరిహద్దులోని కొందరు మిల్లర్లు ఏజెంట్ల ద్వారా సేకరించిన రేషన్​బియ్యాన్ని రీసైక్లింగ్​చేసి, మహారాష్ట్రలో సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఈ దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్​పట్టణాలకు చెందిన 11 మిల్లులు ఈ దందాకు కేంద్ర బిందువుగా మారాయి. రూ.కోట్ల ఆదాయం సమకూరుతుండడంతో మిల్లింగ్​ను పక్కనబెట్టి, పూర్తి స్థాయిలో ఈ దందాపైనే ఫోకస్​పెట్టారు. సివిల్​సప్లయ్​అధికారులకు ఆమ్యామ్యాలు అందడంతో వారు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా కంప్లైంట్​చేసినప్పుడు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

అర్ధరాత్రి సరిహద్దులు దాటుతున్న బియ్యం..

జిల్లాకేంద్రం శివారులోని సారంగాపూర్ వైపు ఉన్న రెండు మిల్లులు, గుండారం ప్రాంతానికి చెందిన నాలుగు, బోధన్​పట్టణంలోని 5 మిల్లులు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు 4 గంటల సమయంలో బియ్యాన్ని ట్రాన్స్​పోర్ట్​చేస్తున్నారు. ఈ సమయంలో అయితే రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి, గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేస్తున్నారు. వ్యాపారుల మధ్య ఈర్ష్యతో ఆఫీసర్లకు కంప్లైట్స్​వెళ్లినప్పుడు మాత్రమే రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల వర్ని మండలంలో ఒక లారీ, వ్యాన్ నిండా ఉన్న 850 బస్తాల (ఒక్కో బస్తా 50 కేజీలు) రేషన్​బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు పట్టుకున్నారు. బోధన్​లోని ఓ రైస్​మిల్ కోసం తీసుకెళ్తున్నట్లు నిందితులు చెప్పారు. నెల రోజుల కింద  ఓ వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోగా, ఈ బియ్యం నగర శివారులోని ఓ మిల్లు నుంచి సరఫరా అయినట్లు నిరార్ధణ అయింది. బోధన్​అంబేద్కర్​కాలనీకి సమీపంలో ఉన్న ఓ రైస్​మిల్​పై ఇటీవల టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు రైడ్​చేయగా రూ.40 లక్షల విలువైన రీసైక్లింగ్​బియ్యం పట్టుబడింది. 

అక్కడికే ఎందుకు..?

సన్నబియ్యంగా మార్చిన వాటిని జిల్లాలో మార్కెట్​చేయడం ఈజీ కాదు. నిత్యం నిర్వహించే ఈ బిజినెస్​లోకల్​గా విస్తరిస్తే సమస్యలు వస్తాయని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో వరిసాగుకు భూములు అనుకూలంగా ఉండవు. కాబట్టి అక్కడ బియ్యానికి డిమాండ్​ఉంటుంది. బియ్యం రాష్ట్రం దాటి వెళ్తున్నందున గోప్యత విషయంలోనూ ఎలాంటి డోకా ఉండదని మిల్లర్ల అభిప్రాయం.

దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి

జిల్లాలో 4.02 లక్షల రేషన్​కార్డులున్నాయి. ప్రతీనెల 8,650 మెట్రిక్​టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందుకోసం 759 రేషన్​షాప్​లు ఉన్నాయి. రేషన్​లో వచ్చే బియ్యాన్ని తినడానికి ఇష్టపడని కొన్ని కుటుంబాలు కిలో రూ.10 చొప్పున మిల్లర్ల ఏజెంట్లకు అమ్ముతారు. మిల్లర్లు, ఏజెంట్లు సేకరించిన బియ్యానికి కిలో రూ.15 చొప్పున చెల్లిస్తారు. ఈ బియ్యాన్ని రైస్​మిల్స్​కు చేర్చి, దొడ్డు బియ్యాన్ని సన్నగా రీసైక్లింగ్​చేస్తున్నారు. బీపీటీ రైస్​తరహాలో కలరింగ్​ఇచ్చి, ఏదో ఓ కంపెనీ పేరు ముద్రించి 25 కిలోల బస్తాలను  మహారాష్ట్రలో సేల్​చేస్తున్నారు. ఏజెంట్​నుంచి రూ.15 కిలో చొప్పున కొంటున్న మిల్లర్లు రీసైక్లింగ్,​తర్వాత కిలో రూ.40 కి అమ్ముకుంటున్నారు. లాభం ఎక్కువగా ఉన్నందున మిల్లర్లు కేవలం ఈ దందాకు ఫిక్స్​అయిపోయారు. ప్రతీ రెండు రోజులకు ఒక లోడు బియ్యం బస్తాల లారీ రుద్రూర్, రాంపూర్, సులేమాన్​ఫారం మీదుగా మహారాష్ట్ర వెళ్తుంది.