- ఆస్పత్రి ఎదుట బాధిత తల్లిదండ్రుల ఆందోళన
- కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘటన
జమ్మికుంట, వెలుగు: డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సూరం నరేశ్, స్నేహ దంపతులకు 11 నెలల బాబు ఉన్నాడు. రెండు రోజుల కింద చిన్నారికి జ్వరం రావడంతో జమ్మికుంటలోని ప్రైవేట్ పిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి బాబుకు సీరియస్ కావడంతో డాక్టర్‌కు సమాచారం అందించారు.
లేట్ గా వచ్చి న డాక్టర్ వెంటనే బాబును హనుమకొండకు తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడికి వెళ్లగానే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డాక్టర్ లేట్ గా రావడంతోనే తమ కొడుకు చనిపోయాడని కుటుంబసభ్యులు మంగళవారం హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ రవి హాస్పిటల్‌కు వెళ్లి బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి సముదాయించారు.