
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని వద్ద తేనెటీగలు దాడి చేయడంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బొగ్గు గని వద్ద ఉన్న మ్యాన్ వైండింగ్ షాఫ్ట్ హెడ్ గేర్‌ను పరిశీలించేందుకు గురువారం ఉదయం 11:50 గంటల ప్రాంతంలో మెకానికల్ మైనింగ్ ఇన్స్పెక్టర్తో సహా 10 మంది అధికారులు మూడో అంతస్తుకు చేరుకోగానే అక్కడున్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా వీరిపై దాడి చేసింది.
దీంతో వారంతా వెంటనే కిందికి పరుగులు తీశారు. ఈ ఘటనలో మెకానికల్ డీడీఎంఎస్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని రక్షణాధికారి పి.రాజు, పిట్ ఇంజనీర్ డి.రాంబాబు, ఇంజనీర్ ఆర్.సైదులు ఇతర అధికారులు, సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి ఏరియా జీఎం మోహన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.