టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ నిర్వహించిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు చేపట్టిన ఈ విక్టరీ పరేడ్లో పలువురు క్రికెట్ అభిమానులు గాయపడగా, మరి కొందరు అస్వస్థకు గురయ్యారు. తాజా సమాచార ప్రకారం 11 మందికి వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రులకు తరలించినట్లు అధికారి శుక్రవారం (జూలై 5) తెలిపారు.
అధిక రద్దీ కారణంగా గాయాలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా తొమ్మిది మంది జీటీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డీన్ తెలిపారు. ఒకరిని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రధమ చికిత్స సంరక్షణ తర్వాత అతన్ని డిశ్చార్జి చేసినట్టు అధికారులు తెలిపారు. మరో వ్యక్తిని దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు.
అభిమానులు తాము ఆరాధించే ఆటగాళ్ల కోసం గంటల తరబడి వేచి చూశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరీక్షించారు. ఇక ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ మొదలయ్యాక ఆటగాళ్లకు అడుగడుగునా జననీరాజనమే. ఈ క్రమంలో అభిమానులు.. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసేందుకు పోటీపడ్డారు. దాంతో, తొక్కిసలాట చోటు చేసుకుంది. ముంబై నారిమన్ పాయింట్ వద్ద కుప్పలు కుప్పలుగా చెప్పులు పడి ఉన్నాయి.
"లక్షలాదిమంది పోగవ్వడంతో పోలీసుల నుంచి రక్షణ కరువైంది. ఏదీ క్రమబద్ధీకరించబడలేదు. జట్టు రాగానే ప్రజలు అరవడం మొదలుపెట్టారు, నా ముందు నిలబడి ఉన్నవారు పడిపోయారు...’’ అని విజయ పరేడ్ సందర్భంగా మెరైన్ డ్రైవ్‌లో ఉన్న క్రికెట్ అభిమాని మీడియాకు తెలిపారు.