మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు.. 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే!

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అంతులేని లోపాలున్నాయని విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​ నిర్ధారించినట్టుగా తెలిసింది. బ్యారేజీలోని ఏడో బ్లాక్​తో పాటు దానికి ఇరువైపులా 6, ఎనిమిదో బ్లాకుల్లో కలిపి 11 పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్​తేల్చిచెప్పినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్​అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిలకు ప్రిలిమినరీ రిపోర్టు కాపీలు ఇచ్చినట్టుగా సమాచారం. గతేడాది అక్టోబర్​21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో ఉన్న 20వ నంబర్ ​పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. దీంతో దానికి ఇరువైపులా ఉన్న పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. నేషనల్​డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఎక్స్​పర్ట్​టీమ్​ బ్యారేజీని పరిశీలించి, ఇరిగేషన్​ అధికారులు ఇచ్చిన పలు రికార్డుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  

బ్యారేజీలోని11 పిల్లర్లు దెబ్బతిన్నాయని, వాటిని పునాదులతో సహా తీసి కొత్తగా నిర్మించాలని సూచించారు. బ్యారేజీలో ఉన్న మొత్తం నీటిని పూర్తిగా తొలగించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విజిలెన్స్​ రిపోర్టులో ఎన్డీఎస్ఏ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ప్రస్తావించినట్టుగా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఒక్క రోజులో జరిగింది కాదని, 2019 నుంచి నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. వరద ఉధృతికి టన్నుల బరువున్న సిమెంట్​బ్లాకులు వంద మీటర్ల దూరం నదిలో కొట్టుకుపోయాయని, డిజైన్, నిర్మాణం, నిర్వహణ​లోపాలను ఇది తేటతెల్లం చేస్తుందని పేర్కొన్నట్లు సమాచారం.

 అప్పుడే జాగ్రత్త పడినా పరిస్థితి వేరేలా ఉండేదని సూచించినట్టుగా తెలిసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకుల్లోనూ లోపాలు ఉన్నట్టుగా తమ పరిశీలనలో తేలిందని, అయితే దాన్ని  నిర్ధారించాల్సింది మాత్రం టెక్నికల్​ టీమేనని పేర్కొన్నట్టుగా తెలిసింది. బ్యారేజీ పనికి వస్తుందా లేదా అనేది ఎన్డీఎస్ఏ సహా ఇతర టెక్నికల్​అథారిటీ తేల్చాల్సి ఉందని, ఆ యా సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగా బ్యారేజీని పునరుద్ధరించవచ్చా లేదా అనేది నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టుగా సమాచారం.