
జగిత్యాల/ధర్మపురి, వెలుగు: వెల్గటూర్ మండలం కప్పాట్రావ్ పేట్ గ్రామ శివారు లో అక్రమంగా నిల్వ చేసిన మట్టి డంపులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. కొందరు అక్రమార్కులు చెరువుల్లోంచి కోట్ల విలువైన మట్టిని తరలించి నిల్వ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు బుధవారం దాడులు చేసి 11 టిప్పర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తహసీల్దార్ శేఖర్, ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
మట్టి దందాపై ఎంక్వైరీ చేయాలి: విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
ధర్మపురి నియోజక వర్గంలో అక్రమ మట్టి దందాపై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ సోషల్ మీడియా వేదికగా అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమంగా మట్టి, కంకర దందా చేశారని ఆరోపించారు. సహజ వనరులు తరలకుండా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
సుల్తానాబాద్ మండలంలో..
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఓ జేసీబీ, టిప్పర్‌ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.