అపర మేధావి ఈ చైనా బాలుడు.. రాకెట్‌ తయారు చేయడానికి 600 లైన్ కోడ్‌

అపర మేధావి ఈ చైనా బాలుడు.. రాకెట్‌ తయారు చేయడానికి 600 లైన్ కోడ్‌

పదకొండేళ్ల వయస్సు అంటే, తోటి పిల్లలతో కలిసి గంతేయాల్సిన సమయం. ఇంకాస్త పల్లెటూర్ల పిల్లకాయల గురించి చెప్పాలంటే వాగులు, వంకలు, గుట్టల  వెంట పరుగులు పెట్టాల్సిన కాలం. కానీ, ఈ బుడతడు వేరు. ఉదయాన్నే లేచింది మొదలు కంప్యూటర్‌తోనే తన ప్రయాణం. కోడ్‌‌తోనే తన పోటీ.. 

చైనాకు చెందిన యాన్ హాంగ్‌సెన్ అనే పదకొండేళ్ల బాలుడు స్వంతంగా రాకెట్‌ తయారు చేయడానికి 600 లైన్ కోడ్‌ను వ్రాసాడు. ఇది రాకెట్ యొక్క ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం అవసరమైన కోడ్‌. అంతటితో అతని పని పూర్తి కాలేదు. దానిని స్వయంగా నిర్మిస్తాడట.. ప్రయోగిస్తాడట. రాకెట్‌ నిర్మించడానికి, దానిని ప్రయోగించడానికి అవసరమైన ప్రోగ్రామింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను ఈ బాలుడు స్వయంగా నేర్చుకున్నాడు. రాకెట్ల పట్ల తనకున్న అభిరుచి, వాటిని నిర్మించడం కోసం తాను పడుతున్న శ్రమ, ఆనందం గురించి యాన్.. నెటిజన్‌లకు తెలియజేస్తూ సందేశాలను పంచుకున్నాడు. దాంతో, అతని గురించి బయట ప్రపంచానికి తెలిసింది. నెటిజన్లు ఈ పిల్లాడిని 'రాకెట్ బాయ్' అని ప్రశంసిస్తున్నారు.

ALSO READ | విజయ్​ మాల్యాపై సెబీ బ్యాన్‌

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ బాలుడికి నాలుగేళ్ళ వయసున్న సమయంలో ఒక ప్రయోగ కేంద్రాన్ని సందర్శించాడు. అప్పటినుంచి రాకెట్లతో అతని ప్రయాణం మొదలైంది. ఈ పిల్లవాడికి సోషల్ మీడియాలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యాన్.. ఎప్పటికప్పడు వారితో తన రాకెట్ అభివృద్ధి వివరాలను పంచుకుంటూనే ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ, చైనా కోసం నిజమైన రాకెట్‌ను నిర్మించడమే తన లక్ష్యమని యాన్ తెలిపాడు. 

కాగా, ఈ వారం ప్రారంభంలో చైనా తన లాంగ్ మార్చి 10 కోసం కొత్త ఇంజిన్‌ను పరీక్షించింది. ఇది చంద్రునిపైకి మనుషులను రవాణా చేయడానికి ప్రతిపాదిత రాకెట్.