ఉక్రెయిన్, రష్యా మధ్య 12 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ సిటీలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలపై దాడులు చేయబోమంటూనే.. అపార్ట్‌మెంట్లు, నివాస ప్రాంతాలపైనా రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లో ఎటు చూసినా భీతావహ వాతావరణమే కనిపిస్తోంది. సుదరంగా ఉన్న నగరాలు బాంబు దాడులతో ధ్వంసమైపోయాయి. హాయిగా పిల్లాపాపలతో గడుపుతున్న కుటుంబాలు చల్లాచెదురైపోయాయి. ఎవరు ఎక్కడకు వెళ్లాలో.. వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు మాతృభూమిని వదలలేకపోతున్నారు. యుద్ధం అందరినీ చిన్నాభిన్నం చేసేసిన.. ఈ కష్ట సమయంలో 11 ఏళ్ల చిన్నారి.. సొంత దేశాన్ని.. కుటుంబాన్ని వదిలి ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఉక్రెయిన్ కు చెందిన 11 ఏళ్ల బాలుడు స్లొవేకియాకు ప్రయాణం అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి కిలోమీటర్లు అమ్మానాన్నల తోడు లేకుండా ఒంటరిగా జర్నీ చేశాడు. చిన్నారి వెంట బ్యాక్ ప్యాక్ బ్యాగు కూడా ఉంది. అతని తల్లి రాసి ఇచ్చిన ఓ చీటీని వెంటబెట్టుకుని, అరచేతిపై రాసిన ఫోన్ నంబర్‌తో అంత దూరంగా వెళ్లాడు.
11 ఏళ్ల ఈ బాలుడు.. ఉక్రెయిన్ సౌత్ ఈస్ట్ సిటీ జపోర్జియాలో నివసించేవాడు. అయితే అదే ప్రాంతాంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు రెండ్రోజుల క్రితం తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇంకా అక్కడే ఉండే ఏ క్షణంలో ఏం జరగుగుతుందోనన్న భయం ఆ చిన్నారి తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే తమ కొడుకును వెంటబెట్టుకుని దేశం దాటిపోదామంటే.. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న ఓ కుటుంబ సభ్యుడిని చూసుకోవాల్సి ఉండడంతో చిన్నారి పేరెంట్స్ ముందు వాడిని సేఫ్ ప్లేస్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు. ధైర్యం చేసి.. ఆ బాలుడిని పొరుగున ఉన్న స్లొవేకియాకు వెళ్లమని పంపారు. కానీ వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఒంటరిగా చేశాడా చిన్నారి.
ఆ బాలుడు చేసిన వెయ్యి కిలోమీటర్ల అసామాన్యమైన ప్రయాణం తర్వాత స్లొవేకియా చేరుకున్న అతనిపై ఆ దేశ నేతలు, అధికారులు ప్రశంసలు కురిపించారు. చిన్నారి నవ్వు.. ధైర్య సాహసాలు.. బాలుడి పట్టుదల, నిబద్ధతలు చూసి స్లొవేకియా హోంమినిస్టర్ చిన్నారిని ‘ ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్’ అంటూ ప్రశంసించారు.
మరోవైపు చిన్నారి తల్లి మాట్లాడుతూ... తన బిడ్డను ట్రైన్ ద్వారా స్లొవేకియాకు పంపామన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న తమ బంధువుల జాడ కనుక్కొని.. వారి చెంతకు వెళ్లాలని చెప్పామన్నారు. తన బిడ్డకు దారిలో అవసరాల కోసం ఫుడ్ లాంటివి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఇచ్చి పంపామని, పాస్ పోర్టు, ఓ చీటీలో మెసేజ్ రాసి పంపామని అన్నారు. అయితే బాలుడు తెచ్చిన చీటిని చూసిన స్లొవేకియా అధికారులు.. అతని బంధువుల అడ్రస్ కనుక్కున్నారు. అరచేతిపై రాసిన ఫోన్ నెంబర్ చూసి... రాజధాని నగరం బ్రటిస్ లావాలో ఉన్న బంధువులకు బాలుడ్ని అప్పగించారు. ఈ విషయం తెలిసిన చిన్నారి తల్లి స్లోవేకియా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.